బీసీ కులగణనకు తీర్మాణం కాదు.. చట్టం తేవాలే

– బీసీల ఆత్మగౌరవం కోసం పోరాడిన  బీసీ మండల్‌
– రిజర్వేషన్‌ కోసం పదవి త్యాగం చేసిన మహనీయుడు
– జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు
అధికారం కోసం బీసీ వర్గాలను వాడుకుని వారి హక్కులను కాంగ్రెస్‌ పార్టీ కాలరాస్తోందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా బీసీల ఆరాధ్యదైవం, బీహర్‌ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్‌ వర్థంతి సందర్బంగా మంథని పట్టణంలోని బీపీ మండల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్బంగా పుట్ట మాట్లాడారు  ఏప్రిల్‌ మాసమంతా మహనీయుల జయంతి,వర్థంతిల మాసమని, మహనీయుల చరిత్ర వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎంతోమంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల చరిత్రను నియోజకవర్గంలో కనబడకుండా చేశారన్నారు.బీసీవర్గాలకు రిజర్వేషన్‌లు ఉండాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న బీపీ మండల్‌ తీర్మాణం చేస్తే అప్పటి ఇందరాగాంధీ రిజర్వేషన్‌లకు సానుకూలంగా తీర్మాణం చేయవద్దని, అలా చేస్తే ముఖ్యమంత్రి పదవినుంచి తొలగిస్తామని ఒత్తిడి చేస్తే తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముఖ్యమంత్రి పదవినే వదులుకున్నగొప్ప మహనీయుడు బీపీ మండల్‌ అని వివరించారు. దేశంలో బీసీ వర్గాలు అనేక సమస్యల్లో ఉన్నారని, వారి అన్ని హక్కులు రావాలని పోరాటం చేశారని ఆయనగుర్తు చేశారు. ఈనాడు దేశంలో సెంట్రల్‌ గౌవర్నమెంట్‌లో బీసీలు రిజర్వేషన్‌లు పొందుతున్నారంటే అందుకు బీపీ మండల్‌ సిఫారస్‌ కారణమన్నారు.అయితే బీసీలను మరోమారు వాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కులగణన పేరుతో ముందుకు వచ్చారని, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మాణం చేశారే కానీ చట్టం తీసుకురాలేదన్నారు. ఓ వైపు కులగణనకు ఆదేశాలు జారీ చేసి మరో వైపు ఎన్నికలకు సిద్దం అవుతున్నారని అన్నారు.చట్టం వస్తే బీసీవర్గాలకు అన్నిహక్కులు వస్తాయని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తరహాలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్పూర్తితో ముందుకు సాగుతామని, బీపీ మండల్‌ పోరాట స్సూర్తిని నియోజకవర్గంలో చాటి చెప్తామని అన్నారు.అలాగే అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
Spread the love