హాలియాలో బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థుల నిరసన

నవతెలంగాణ-హలియా: హాలియాలోని బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థుల నిరసన నిత్యం ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు, రుచిగా లేని కూరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంతేకాకుండా పాఠశాలలో సకాలంలో సిలబస్ పూర్తి చేయడం లేదని హాలియాలోని బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం ప్రార్థన సమయం అనంతరం విద్యార్థులు పలు అంశాలపై ఉపాధ్యాయులను నిలదీశారు. అంతేకాకుండా ఆడిటోరియంలో నిరసనకు దిగారు. ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్ పూర్తి చేయకపోవడంతో చదువు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు పాఠశాలలో రోజువారి మెనూ లో వంటలు తినే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు, కూరలతో ఇబ్బందులు పడుతున్నామని తద్వారా ఫుడ్ పాయిజన్ తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులను ఉపాధ్యాయులకు వివరిస్తే వారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు విద్యార్ధినులు తరగతులను బహిష్కరించి ఆడిటోరియంలో బైఠాయించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి బాలు నాయక్ పాఠశాలకు చేరుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్ ఆంక్షలతో తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వెలిబుచ్చారు.

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి…
హాలియాలోని నిర్మల పాఠశాలలో ఉన్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమస్యలపై పాఠశాల విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జైవీర్ పాఠశాలకు రావడంతో తరగతి గదుల్లో విద్యార్థినులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. పాఠశాలలో విద్యాబోధనపై పలు సమస్యలను ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. నిర్ణీత సమయం ప్రకారం సిలబస్ పూర్తి చేయడం లేదని పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం లేదని వాపోయారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జై వీర్ పాఠశాల వంటగదిలోని వంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా అన్నం, చారు, కూరలు రుచి చూసి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇకనుండి నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపాల్ క్రాంతి ని ఆయన ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Spread the love