– తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విరోధి ప్రభుత్వం
– ఈ నెల 30 తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనుమరుగు
– ఐదేండ్లపాటు పేదలకు ఉచిత రేషన్ ఇస్తాం
– బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీసీ సామాజిక తరగతులకు న్యాయం జరగాలన్నా, బీసీ ఎమ్మెల్యే సీఎం కావాలన్నా బీజేపీని గెలిపించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. పేదలకు వచ్చే ఐదేండ్ల పాటు ఉచిత రేషన్ ఇస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మోడీ మాట్లాడుతూ.. 2013లో ఎల్బీ స్టేడియంలో జరిగిన సభతో ఎంతో స్ఫూర్తి పొందాననీ, ఆ సభ తర్వాతే ప్రధాని అయ్యానని గుర్తుచేసుకున్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక, అవినీతి ప్రభుత్వం ఉందని విమర్శించారు. నవంబర్ 30 తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ సర్కార్ కనుమరుగై కమల వికాసం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ ఆ మూడింటినీ విస్మరించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు సీ టీమ్ కాంగ్రెస్ అనీ, ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన వారున్నారనీ, తప్పులు చేయడమే కాకుండా దర్యాప్తు సంస్థలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. అవినీతిని బీజేపీ సహించదనీ, దోషులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, రుణమాఫీ, ఇలా అన్ని హామీలనూ విస్మరించిందని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయన్నారు. యువత భవిష్యత్తుతో బీఆర్‌ఎస్ ఆడుకుంటున్నదని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు, బలహీన సామాజిక తరగతుల అభ్యున్నతికి బీజేపీ పాటుపడిందనీ, అందులో భాగంగానే జీఎంసీ బాలయోగి, పీఎ సంగ్మాలను లోక్‌సభ స్పీకర్లుగా, అబ్దుల్ కలాం అజాద్, రామ్‌నాధ్ కోవింద్, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతులుగా చేసిందని గుర్తుచేశారు. ఓబీసీ సామాజిక తరగతికి చెందిన వారిలో కేంద్ర మంత్రులుగా 27 మంది, బీజేపీ ఎంపీలుగా 85 మంది, 365 ఎమ్మెల్యేలు, 65 మంది ఎంఎల్‌సీలు ఉన్నారని తెలిపారు. వెనక బడిన సామాజిక తరగతులకు చెందిన వారికి చేయూతనిచ్చేందుకు విశ్వ కర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మార్పు తుఫానులా కనిపిస్తోందన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..జల్, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారనీ, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాయుధ పోరాటం నడిచిందనీ, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. తెలంగాణ గడ్డలోనే పోరాటతత్వం ఉందన్నారు. సకల జనులు సమరం చేస్తే తెలంగాణ రాష్ట్రమొచ్చిందన్నారు. ఏ నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో అది నెరవేరలేదన్నారు. తెలంగాణ, ఏపీలో ఐదేండ్లు ఎన్నికల వాతావరణమే ఉంటున్నదనీ, ఈ ధోరణి వల్ల అవినీతి పెరిగి అభివృద్ధి ఆగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలుండాలనీ, ఆ తర్వాత అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. ఆ దిశగా మోడీ పనిచేస్తున్నారని కొనియాడారు. దేశాభివృద్ధికి అంతర్గత భద్రత చాలా ముఖ్యమనీ, దాన్ని కాపాడటంలో మోడీ లాంటి బలమైన నాయకుడు మనకున్నాడని చెప్పారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీకి జనసేన నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలని విమర్శించారు. 2018లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారన్నారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ.. బీఆర్‌ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీతోనే మార్పు సాధ్యమని చెప్పారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ అర్వింద్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తదితరులు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.