నవతెలంగాణ – ఢిల్లీ
భారత్ లో ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ కోసం భారత్ లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసిన పాకిస్థాన్.. భారత్ లో కొన్ని వేదికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తద్వారా బీసీసీఐ, ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహారం తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. గ్రూపు దశలో రెండు మ్యాచ్ లకు సంబంధించి వేదికలను మార్చాలని ఐసీసీని పాకిస్థాన్ కోరినట్టు తెలిసింది. కానీ, పాక్ డిమాండ్ ను అటు ఐసీసీ, ఇటు బీసీసీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. అక్టోబర్ 20న బెంగళూరులో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. అలాగే, 23న చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్ ను ఎదుర్కోనుంది. కానీ, దీన్ని రివర్స్ చేయాలని పాక్ డిమాండ్ చేస్తోంది. బెంగళూరులో ఆప్ఘనిస్థాన్ తో.. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని కోరింది. కానీ, పాకిస్థాన్ డిమాండ్ ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి. ఇదే నిర్ణయాన్ని మంగళవారం నాటి సమావేశం తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు తెలియజేశాయి. మరి చివరికి పాక్ వన్డే కప్ కోసం భారత్ కు వస్తుందా? లేదా? అన్నది చూడాలి.