తుపానుపై అప్రమత్తంగా ఉండండి.. ప్రధాని మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాన్‌ అతితీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తుపాను పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. విద్యుత్తు, తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టేలా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తుపాను పరిస్థితులను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపింది. ఇప్పటికే 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించిందని, మరో 15 బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది. మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సైతం బిపోర్‌జాయ్‌ తుపాను సంసిద్ధత చర్యలను సమీక్షించింది. తుపాను ప్రస్తుత పరిస్థితిని వాతావరణ శాఖ వివరించింది. ‘ఈ తుపాను జూన్ 14 వరకు ఉత్తర దిశగా కదులుతూ.. ఆ తర్వాత గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లను దాటుతుంది. జూన్ 15 మధ్యాహ్నం నాటికి గుజరాత్‌లోని మాండ్వి, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య జఖావూ పోర్ట్‌ (గుజరాత్‌) సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 125-150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి’ అని అంచనా వేసింది.

Spread the love