మండేకాలం… జర జాగ్రత్త?

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు కాలాలకు అతీత (పరస్పర విరుద్ధ) పరిస్థితులను చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. వేసవి రాకముందే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఉక్కపోత, అకాల వర్షాలు… శీతాకాలంలో రాత్రిపూట వేడి, ఇలాంటి వాటి అన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం. ఈ పరిస్థితిలే దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. 2023లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే ప్రభుత్వాలను హెచ్చరించారు. వాటితో పోరాడేలా అధిక వేడి కార్యాచరణ ప్రణాళికలు… అవగాహన, రక్షణ చర్యలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ పరస్పర విరుద్ధ వాతావరణాలే ఈఎల్‌నినో, లానినా! ఇవి రెండు స్పానిష్‌ పేర్లు. భూమధ్యరేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రం ఉపరితలంపై అసాధారణ వేడి లేదా… చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. దీనినే సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఈఎన్‌ఎస్‌ఓ) అంటారు. దీని వలన ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. ఎల్‌నినో అయితే విపరీతమైన వేడి, తక్కువ వర్షపాతం, లా..నినాలో వర్షాలు విపరీతంగా ఉంటాయి. ఈ రెండు పరిణామాలు ప్రతి నాలుగైదు ఏండ్లకు భ్రమణంలో ఈ రెండు పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి. మన దేశంలో 90శాతం భూభాగం వేడి గాలులకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఆ పరిణామాల ప్రభావం మేరకు ఉదయం నుంచే ఎండ భగభగ మండిపోతుంది. మన దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉంటున్నాయి. అందులో 1990-2020 మధ్య కాలంలో వడగాల్పుల వల్ల దేశంలో 25,983 మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. 2050 నాటికి దేశంలోని 24నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతల సగటు 35డిగ్రీలకు మించి పోనుందని ఓ అంచనా తెలుపుతుంది. ప్రపంచంలో అధిక వేడి ఉంటున్న దేశాల్లో భారత్‌ ఒకటి కావడం ప్రమాద సంకేతమని అంటున్నారు. అలాగే ప్రకృతి విపత్తుల పరంగా రాష్ట్రంలో వడ గాలులు ఎక్కువగా ప్రాణాలు తీస్తున్నాయి. 2015 నుంచి 2017 వరకు 973 మరణాలు సంభవించాయి. భానుడి భగభగలతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45డిగ్రీలు దాటాయి. ఇప్పటికే సుమారు ఇరవైమంది వరకు చనిపోయినట్టు వార్తలు.
వడగాలుల తీవ్రత… నీటి ఎద్దడి
ఈసారి వడగాలుల తీవ్రత పెరగనుందని అందుకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు రాబోయే నీటి ఎద్దడిని తట్టుకునేలా వేసవి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. వేసవి ఉష్ణోగ్రతలు ఏకంగా గత చరిత్రను తిరగ రాసి రికార్డులు సృష్టిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మన దేశంలో ఎక్కువ ప్రాణాలు హరిస్తున్న ప్రకృతి విపత్తుల్లో వేసవిలో అగ్రి ప్రమాదాలు, పిడుగులు, సంభవిస్తాయి. ప్రజలు నిత్యావసరాలు, చదువులు, పర్యాటక ప్రయాణాలు, పెళ్లిళ్లు లాంటివి ఎన్నో కార్యక్రమాల కోసం బయటకు తిరగాల్సి ఉంటుంది. ప్రజలు వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది. కార్మికులు, కర్షకులు, కూలీలు తదితర పేద, మధ్యతరగతి ప్రజలు వారి జీవనోపాధి కోసం ఏ కాలంలో నైన బతుకుతెరువుకై వ్యవసాయ పనులకు, ప్రభుత్వం వారి ఉపాధి హామీ పనులకు వెళ్ళక తప్పదు. కానీ వారి పని వేళల్లో వేసవి మండే ఎండల తీవ్రత దృష్ట్యా మిట్ట మధ్యాహ్నపు వేళలలో పనులను ఆపివేయాలి. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకు ఉదయం 11గంటలలోపు, సాయంత్రం 4గంటల తర్వాత బయటకు వెళ్లేలా పనులను చక్కబెట్టుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణ ప్రమాదం సంభవిస్తుంది. నిపుణుల హెచ్చరికల దృష్ట్యా వేసవిలోని మండే ఎండల్లో తగు జాగ్రత్తలు, భద్రత పాటించకపోతే వడదెబ్బ బారిన పడి అనారోగ్యాల పాలు కావలసి వస్తుంది. సమస్య తీవ్రమైతే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అందుకే ”చేతులు కాలాక ఆకులు పట్టుకునే” కంటే వేసవికాలంలో పిల్లలు, వృద్దులు, మధ్య వయస్సువారు అనే తేడా లేకుండా వడదెబ్బ నిశ్శబ్దంగా కబళించి వేస్తుంది. అందుకే ఎండ తగలకుండా ఉండే ప్రయత్నాలు చేయాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి.
తగు జాగ్రత్తలు అవసరం
వేసవిలో మన ఆరోగ్యం మన చేతుల్లోనే… రక్షిత మంచి నీరు తాగుతుండాలి. మజ్జిగ, నిమ్మకాయ రసం, పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకోవడం చాలా మంచిది. ఆహారం మితంగా తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే సొర, దోస, పుచ్చకాయ లాంటి నీరు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి. ముంజలు లాంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎప్పుడు ఖాళీ కడుపుతో ఉండకూడదు. అనివార్యంగా బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లాలి. కండ్లకు కూలింగ్‌ అద్దాలు, తలకు, ముక్కుకు, రక్షణగా టోపీ లేదా స్కార్ఫ్‌ గుడ్డ కట్టుకోవాలి. ఆహార పదార్థాలు తీసుకోవడంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మసాలాలు, మాంసాహారం, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలకు, నూనెలు, వేపుళ్లుకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ వల్ల శరీరం డిహైడ్రేషన్కు లోనవుతుంది. వీటిని నియంత్రించాలి. అలాగే బట్టలు ముదురు రంగు దుస్తులు వాడరాదు. లేత, తెలుపు, కాటన్‌ వస్త్రాలు చాలా శ్రేయస్కరం. అంతేకాదు వేడిమిని నియంత్రించగలవు, శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. సమ్మర్‌ కిట్‌లో పైన చెప్పిన వాటితో పాటు మెత్తని టవల్‌ ఓ ఆర్‌ఎస్‌, గ్లూకోజ్‌ ప్యాకెట్లు ఉంచుకోవడం మంచిది. అలాగే ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందువల్ల అగ్ని ప్రమాదాలు, విద్యుత్‌ పరికరాల వాడకంలో, మొబైల్‌ ఫోన్ల వాడకంలో, ప్రయాణ సాధనాలైన బైకులు, కార్లు వంటి వాడకంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో అత్యధిక ఉష్ణోగ్రత వల్ల ప్రమాదాలు సంభవించి ఆస్తి నష్టం, ప్రాణస్టం కూడా తోడవుతుంది. వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు ప్రయాణాంలో అప్రమత్తత ఎంతో అవసరం ఉంది. వేసవి కాలంలో ఎవరైనా ఎండలో తిరగవద్దు అంటారు, తిరగడం తప్పని పరి స్థితిలో ఎక్కడికి అక్కడ తగు జాగ్రత్త తీసుకుంటూ వేసవి చిట్కాలు పాటిస్తూ, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే ”మనలో ఉన్న శక్తిని” ఆయుధంగా చేబుని ఆందోళన చెందకుండా ఎండాకాలం గండాన్ని అలవోకగా దాటేసి, హాయిగా వర్షాకాలన్ని ఆహ్వానిద్దాం.., అన్ని కాలాలను అధిగమిస్తూ జీవించడమే మనిషి జీవన స్వభావం. ఇదే ప్రకతి మనకు ఇచ్చిన అద్భుతమైన శక్తి సామర్థ్యం ఏమంటారు..?

మేకిరి దామోదర్‌
9573666650

Spread the love