అపరిచితులతో జాగ్రత్తా… వేణు గీతికకు పేమ్రతో…

ఎలా ఉన్నావ్‌ బంగారు తల్లి? ప్రతి వారం అమ్మ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటున్నావా? చెప్పక తప్పదు మరి. ఎందుకంటే జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎందరితోనో పరిచయాలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నీకు బాగా ఊహ తెలిసింది కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేవన్నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఎదుర్కోవలసినవే.
ఈ రోజు నీకు అపరిచితులతో ఎలా ఉండాలో చెప్తాను. మనకు తెలియని వాళ్ళని అపరిచితులు అంటాము. పార్కుల్లో, సినిమా హాళ్ళల్లో, షాపింగ్‌ చేసేటప్పుడు, ప్రయాణాల్లో ఇలా ఎక్కడో ఒక చోట తారసపడి పలకరిస్తుంటారు. వీళ్ళు ఎంతో స్నేహంగా మాట కలుపుతారు. పరిచయం చేసుకుంటారు. వాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పే వివరాలు ఎంత వరకు నిజమో మనకు తెలియదు. ఇటువంటి వారు వాళ్ళ గురించి చెప్తూనే మన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌ నెంబర్‌ అడిగితే ‘నేనే మీకు ఫోన్‌ చేస్తాను, మీ నెంబర్‌ ఇవ్వండి’ అని అడిగి తీసుకోవాలే తప్ప నీ నెంబర్‌ ఇవ్వకూడదు. వ్యక్తిగత వివరాలు ఏమైనా అడిగితే ‘నేను కొంచెం పని తొందరలో ఉన్నాను, నెంబర్‌ తీసుకున్నాను కదా తర్వాత తీరిగ్గా మాట్లాడతాను’ అని చెప్పాలి. మన వ్యక్తిగత విషయాలు అస్సలు చెప్పవద్దు.
కొందరు అవగాహన లేక అపరిచితులతో పరిచయం పెట్టుకుని అనేక సమస్యలు తెచ్చుకుంటారు. ఉదాహరణకు అపరిచిత వ్యక్తి పార్కులో పరిచయం అయ్యారని అనుకుందాం. రోజూ వాకింగ్‌లో మాట్లాడుకుంటారు. వాళ్ళు మాటల్లో ‘నిన్ననే మా అమ్మాయికి ఒక బంగారు గొలుసు చేయించాననో, స్థలం కొన్నామనో, ఇన్ని లక్షలు పెట్టి కారు కొనాలి అనుకుంటున్నామనో’ ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వీళ్లు కూడా అన్ని విషయాలు పూస గుచ్చినట్లు చెప్తారు. ఆ తర్వాత రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలు వారి వరకే ఆగిపోవు, ఇంటి వరకు తెచ్చుకుంటారు. తర్వాత వాటి నుండి బయట పడటానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.
అయితే అందరూ ఇలాగే ఉంటారని నేను అనను. వారి గురించి పూర్తిగా తెలియనంతవరకు ఏ విషయాలూ మాట్లాడకుండా ఉండటమే మంచిది. మనం తక్కువ మాట్లాడి, అవతలి వారి వివరాలు ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయాలి చిట్టితల్లి. వారు నివసించే ప్రాంతంలో నీకు తెలిసిన వాళ్లు ఉంటే కనుక వారి ద్వారా వీరి గురించి తెలుసుకోవాలి.
మాటలతో మభ్య పెట్టేవారు ఉంటారు. నమ్మకం కలిగేలా మాట్లాడతారు. మీరు ఇంకా లోక జ్ఞానం లేని చిన్న పిల్లలు కనుక చెప్తున్నాను నాన్న. ఎవరికీ ఫోన్‌ నంబర్స్‌, అడ్రసు లాంటివి ఇవ్వ వద్దు. సమస్యలు కొని తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉంటావని ఆశిస్తూ….
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

Spread the love