కొడితే రికార్డే!

– ఊరిస్తున్న ఐసీసీ టెస్టు గద
– వరుసగా రెండో ఫైనల్లో భారత్‌
– ఓవల్‌లో ఇక ఆసీస్‌తో అమీతుమీ
     ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌. రెండేండ్ల పాటు ద్వైపాక్షిక పోరులో ఇంట, బయట విజయం కోసం చెమటోడ్చేది ఈ అంతిమ సమరంలో ఢకొీట్టేందుకే!. టీమ్‌ ఇండియా వరుసగా రెండోసారి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుకుంది. తొలి ప్రయత్నంలో న్యూజిలాండ్‌కు తలొగ్గిన భారత్‌.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి షురూ కానున్న టెస్టు క్రికెట్‌ అంతిమ సమరంలో.. గద గెల్చుకుని ఐసీసీ నాలుగు టైటిళ్లు సాధించిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించేందుకు భారత్‌, ఆస్ట్రేలియా రంగం సిద్ధం చేసుకున్నాయి!.
– రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌
బ్యాటింగ్‌కు ఇంగ్లాండ్‌ పరిస్థితులు అత్యంత సవాల్‌తో కూడుకున్నవిగా నా అభిప్రాయం. క్రీజులో నిలిచేందుకు సరైన ఫోకస్‌తో సన్నద్ధమైతే కొంతమేర సక్సెస్‌ సాధించవచ్చు. ఇంగ్లాండ్‌లో గత రెండేండ్లలో బ్యాటింగ్‌ చేసిన అనుభవంతో చెబుతున్నాను.. ఇక్కడ పిచ్‌లపై ఎంత సేపు నిలిచినా కుదురుకున్నట్టే ఉండదు. వాతావరణం మారుతూనే ఉంటుంది. దీంతో స్పెల్స్‌, సెషన్ల పాటు ఏకాగ్రత, సహనంతో ఉండాలి. టెస్టు క్రికెట్‌ సంధించే అందమైన సవాల్‌ ఇదే. బౌలర్లపై ఎదురుదాడి చేయాల్సిన సమయం ఇదేనని బ్యాటర్‌కు అనిపిస్తుంది. ఆ సమయం కోసం ఎదురుచూసి సిద్ధంగా ఉండాలి. అంతకుమించి, ఆ సమయం వరకు క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించాలి.
నవతెలంగాణ-లండన్‌
ఎవరు నెగ్గినా చరిత్రే
భారత్‌, ఆస్ట్రేలియా అరుదైన రికార్డు ముంగిట నిలిచాయి. ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్న ఈ రెండు జట్లు.. ది ఓవల్‌లో టెస్టు చాంపియన్‌షిప్‌ గద సాధించిన జట్టు అరుదైన రికార్డు సాధించనుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లను సాధించిన జట్లలో భారత్‌, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ తొలి విజేతగా న్యూజిలాండ్‌ నిలిచింది. కానీ ఆ జట్టుకు మిగతా మూడు ఐసీసీ టైటిళ్లు లేవు. దీంతో తాజా ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు ఐసీసీ నాలుగు టైటిళ్లు సాధించిన జట్టుగా నిలువనుంది. రెండోసారి ఫైనల్స్‌కు చేరుకున్న టీమ్‌ ఇండియా ఆ ఘనత సాధిస్తుందా.. అనుకూల పరిస్థితుల్లో ఆస్ట్రేలియానే రికార్డు సొంతం చేసుకుంటుందా? ఆసక్తికరం.
మిడిల్‌ ముఖ్యం
ప్రతిష్టాత్మక టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఇరు జట్లకు మిడిల్‌ ఆర్డర్‌ కీలకం. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో, ప్రత్యేకించి తాజా డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఓపెనర్లకు ఇక్కడ మంచి రికార్డు లేదు. కానీ లండన్‌లో ఓపెనర్లకు ఫర్వాలేదు. 2023 డబ్ల్యూటీసీలో ఇంగ్లాండ్‌లో 11 టెస్టులు ఆడగా.. అందులో ఓపెనర్ల సగటు 28.06. ఈ 11 టెస్టుల్లో ఓపెనర్ల నుంచి రెండు శతకాలు నమోదు కాగా.. అవి కూడా భారత బ్యాటర్లు కెఎల్‌ రాహుల్‌ (129, లార్డ్స్‌), రోహిత్‌ శర్మ (127, ది ఓవల్‌) సాధించారు. టాప్‌ ఆర్డర్‌కు మెరుగైన రికార్డు లేకపోవటంతో సహజంగానే మిడిల్‌ ఆర్డర్‌దే బాధ్యత. చతేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానె భారత మిడిల్‌ ఆర్డర్‌ భారం మోస్తున్నారు. ఆస్ట్రేలియాపై పుజారకు తిరుగులేని రికార్డుంది. కంగారూలపై 24 టెస్టుల్లోనే 2033 పరుగులు బాదిన పుజార.. ఐదు శతకాలు సైతం బాదాడు. భారత్‌, ఆసీస్‌ పరిస్థితులకు వ్యత్యాసం లేకుండా పుజార కంగారూలపై పరుగుల వరద పారించాడు. ఆసీస్‌ పరిస్థితులను తలపించే ది ఓవల్‌లో, ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌ అనుభవంతో పుజార మరో స్పెషల్‌ ఇన్నింగ్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. పుజారను నిలువరించటం ఆస్ట్రేలియా బౌలర్ల ముందున్న ప్రధాన సవాల్‌. ఇక విరాట్‌ కోహ్లి ఆసీస్‌పై చివరి టెస్టులో శతక మోత మోగించాడు. ఐపీఎల్‌లో వరుస సెంచరీలతో ఊపందుకున్నాడు. కెరీర్‌ ఉత్తమ ఫామ్‌ను తిరిగి అందుకున్న కోహ్లిని అడ్డుకోవటం కంగారూలకు తలనొప్పిగా మారనుంది. ఇక పునరాగమన ఉత్సాహంలో ఉన్న అజింక్య రహానె విదేశీ పిచ్‌లపై సహజంగానే అత్యంత భిన్నమైన బ్యాటర్‌. పేస్‌కు అనుకూలించే పిచ్‌లు అనగానే రహానె పరుగుల ప్రవాహం పారిస్తాడు. పుజార, కోహ్లి, రహానె త్రయం ప్రదర్శన భారత్‌ విజయావకాశాలను నిర్దేశించనుంది. ఆస్ట్రేలియా తరఫున మిడిల్‌ ఆర్డర్‌లో మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, కామెరూన్‌ గ్రీన్‌ ఆ పాత్రను పోషించనున్నారు. టాప్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజాలు మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఆ ఇద్దరి లోటు పేడ్చేదెలా?
టెస్టు క్రికెట్‌లో రిషబ్‌ పంత్‌ పూడ్చలేని లోటు. అతడి స్థానాన్ని భర్తీ చేయలేని పరిస్థితి. 2020 డిసెంబర్‌ 1 నుంచి ఆడిన 20 టెస్టుల్లో (34 ఇన్నింగ్స్‌లు) పంత్‌ ఏకంగా 1457 పరుగులు చేశాడు. సగటు 47 కాగా, స్ట్రయిక్‌రేట్‌ 76.80. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్థ శతకాలు ఉన్నాయి. లోయర్‌ ఆర్డర్‌లో ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించేవాడు పంత్‌. ఇప్పుడు అతడు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. లోయర్‌ ఆర్డర్‌ అతడి స్థానాన్ని పూడ్చటం భారత జట్టు ముందున్న అతిపెద్ద సవాల్‌. వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ఓ ప్రత్యామ్నాయం. సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం రేసులోనే ఉన్నాడు. కానీ రవీంద్ర జడేజాతో జట్టు పంత్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో ఉంది. ఇక పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్యతో ఫైనల్‌కు అందుబాటులో లేడు. బుమ్రా లేని భారత పేస్‌ దళం.. ఆసీస్‌ పేస్‌ విభాగంతో సమవుజ్జీ కాలేదు. ఆసీస్‌ పేసర్లకు తలదన్నే ప్రదర్శన చేయాలంటే.. అందుకు ఒక్కటే మార్గం. మహ్మద్‌ షమి అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇంగ్లాండ్‌ పిచ్‌లు షమి బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. ఇక్కడి పిచ్‌లపై మంచి రికార్డు సైతం ఉంది. కొత్త, పాత బంతితో జోరుమీదున్న షమిని ఎదుర్కొవటం అంత సులువు కాదు. మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌ తోడుగా మహ్మద్‌ షమి ఉత్తమ ప్రదర్శన చేయగలిగితే.. బుమ్రా లేకపోయినా పేస్‌ విభాగం సూపర్‌ హిట్టే!.

Spread the love