బీట్రిజ్‌ మైయా మాయ

క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌ అమ్మాయి
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
పారిస్‌ (ఫ్రాన్స్‌) : బ్రెజిల్‌ క్రీడాకారిణి బీట్రిజ్‌ హద్దాద్‌ మైయా మ్యాజిక్‌ చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ నాల్గో రౌండ్లో స్పెయిన్‌ అమ్మాయి సారా సోరిబెస్‌ టార్మోపై గెలుపొందిన మైయా.. 1968 తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్న తొలి బ్రెజిల్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మూడు సెట్ల పోరులో చెమటోడ్చిన మైయా.. 6-7(3-7), 6-3, 7-5తో మెరుపు విజయం సాధించింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన మైయా.. వరుసగా చివరి రెండు సెట్లను సొంతం చేసుకుంది. ఏకంగా తొమ్మిది బ్రేక్‌ పాయింట్లు సాధించిన మైయా.. పాయింట్ల పరంగా 127-120తో ఆధిక్యం సాధించింది. సారా 15 గేములు నెగ్గగా.. మైయా 19 గేముల్లో పైచేయి సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ట్యూనిషియా అమ్మాయి ఓన్స్‌ జెబ్యూర్‌ మెరిసింది. అమెరికా క్రీడాకారిణి బెర్నార్డ పెరాపై 6-3, 6-1తో వరుస సెట్లలో గెలుపొందిన జెబ్యూర్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ఎనిమిది బ్రేక్‌ పాయింట్లు సాధించిన ట్యూనిషియా స్టార్‌.. పాయింట్ల పరంగా 62-41 తిరుగులేని పట్టు సాధించింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో బీట్రిజ్‌ హద్దాద్‌ మైయాతో ఓన్స్‌ జెబ్యూర్‌ తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో నాల్గో సీడ్‌, నార్వే ఆటగాడు కాస్పర్‌ రూడ్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. చిలీ ఆటగాడు నికోలస్‌ జార్రీపై 7-6(7-3), 7-5, 7-5తో ఉత్కంఠ మ్యాచ్‌లో గెలుపొందిన రూడ్‌.. టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన రూడ్‌.. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. తర్వాతి రెండు సెట్లు సైతం ఉత్కంఠగా సాగినా.. టైబ్రేకర్‌ అవసరం లేకుండానే రూడ్‌ ముగించాడు.

Spread the love