అందంగా ఉండాలన్న ఆశ ఎవరికి ఉండదు చెప్పండి! దానికోసం వేలకు వేలు బ్యూటీ పార్లర్లకు పెట్టేస్తుంటారు కూడానూ. అయితే ఇలా ఖర్చు పెట్టడం అందరి వల్లా కాదు కదా. బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే అందంగా మెరిసిపోయేందుకు హోమ్ రెమిడీస్ చాలానే ఉన్నాయి. అందులో నారింజ తొక్కలతో చేసుకునే స్క్రబ్ చర్మం నిగారించేలా చేస్తుంది. అయితే ఈ నారింజ స్క్రబ్‌ను ఎలాంటి సమయాల్లో వాడొచ్చు, దీని వల్ల ఉపయోగాలేంటి, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ముఖానికి, చేతులకు, కాళ్లకు టాన్ పట్టి నల్లగా మారుతాయి. అందులోనూ ఇప్పుడు రానున్నది వేసవి కాలం. కొంచెం సేపు ఎండలో బయటకి వెళ్ళి వచ్చినా బయటి వేడికి, చెమటకు ముఖం కాంతి హీనంగా మారుతుంది. ఇటువంటి సమయంలో నారింజ తొక్కలతో తయారు చేసిన స్క్రబ్‌ను ఉపయోగించి ముఖం కాంతి వంతంగా అయ్యేలా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ స్క్రబ్‌తో పాదాలు, చేతులకు కూడా మసాజ్ చేసుకుంటే టాన్ పోయి, మెరుపు సొంతమవుతుంది. అంతేకాదు ఈ స్క్రబ్ వల్ల డీ హైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. చర్మం తేమగా మారుతుంది. చర్మం మదువుగా, సున్నితంగా ఉంటుంది. దీని వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు.
ప్రయోజనాలు
– నారింజ తొక్కలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా సున్నితంగా మురికి లేకుండా తొలగిస్తాయి.
– మత కణాలను, మలినాలను తొలగిస్తాయి. చర్మం కింద భాగం దెబ్బ తినకుండా కాపాడతాయి.
– నారింజ తొక్కలోని యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ గుణాలు చర్మాన్ని పాదాలను వాపు వల్ల కలిగే అసౌకర్యం నుండి కాపాడతాయి.
– ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
– నారింజలోని విటమిన్ సి చర్మాన్ని దెబ్బతీసే వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.
– యాంటీ ఏజింగ్ లక్షణాలు నారెంజ తొక్కలో ఎక్కువ. కాబట్టి ఆరంజ్ పీల్ స్క్రబ్ చేసుకోవడం వల్ల చర్మానికి చాలా మేలు జరుగుతుంది.
– డార్క్ స్పాట్స్, మచ్చలు పోతాయి.
స్క్రబ్ తయారీ
నారింజ తినే ముందు శుభ్రంగా కడిగి ఉపయోగిస్తాం కాబట్టి, ఈ తొక్కలను గాలికి ఆరబెట్టాలి. ఇవి బాగా ఆరడానికి కొన్ని రోజులు పడుతుంది. బాగా ఎండిపోయాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని కంటైనర్‌లో భద్రపరుచుకోవాలి. స్క్రబ్ చేయడానికి ముందు ఒక గిన్నెలో నారింజ తొక్క పొడిని, కాస్త చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో కాస్త ఆలీవ్ నూనె లేదా కొబ్బరి నూనె వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించి ఐదు నుంచి పది నిమిషాల పాటు వత్తాకార పద్ధతిలో మసాజ్ చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం సేపు అలాగే వదిలేయాలి. ఆరిపోయాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మళ్ళీ సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి లేదా రెండు వారాలకొకసారి చేస్తూ ఉంటే ముఖం క్లీనవుతుంది.