నవతెలంగాణ – న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో సమీక్షల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం గురువారం రాష్ట్ర నేతలతో తొలి కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్, భూపేంద్ర సింగ్ హుడా, దీపక్ బబారియా, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ… ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువగా చూసుకున్నారని అన్నట్లు సమాచారం. మొత్తం ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాలే ప్రధానమని రాహుల్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని, దానిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్ అన్నట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత అజయ్ మాకెన్ మాట్లాడుతూ… ఫలితాలు షాకింగ్ గా, ఊహించని విధంగా వున్నాయని అన్నారు. కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ…హర్యానాలో ఓటమికి గల కారణాలపై నేటి సమావేశంలో చర్చించాం. మా విశ్లేషణ కొనసాగిస్తాం. తదుపరి చర్యలు ఏమిటన్నది తర్వాత చెబుతుం అని వేణుగోపాల్ అన్నారు.