భూ పోరాట నాయకులకు బేడీలు

Bedis for land struggle leaders కరీంనగర్‌ జైలు నుంచి జగిత్యాల కోర్టుకు తరలింపు
– పోలీసుల చర్యపై ప్రజాసంఘాల ఆగ్రహం
నవతెలంగాణ – కరీంనగర్‌
జగిత్యాల జిల్లాలో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి 15 రోజుల కిందట కరీంనగర్‌ జిల్లా జైలులో పెట్టారు. మంగళవారం జగిత్యాల కోర్టు పేషీ నిమిత్తం నాయకులు లెల్లెల బాలకృష్ణ, జి.తిరుపతి నాయక్‌, రమేష్‌ తదితర నాయకులను బేడీలు వేసి తీసుకెళ్లారు. ఇది చాలా దుర్మార్గమని కరీంనగర్‌ సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్‌ ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ శాస్త్ర చట్టం ప్రకారం.. నిందితులను క్రిమినల్‌ ఖైదీగా నిర్ధారించిన వారికి మాత్రమే బేడీలు వేసి కోర్టులకు తరలించాలని నిబంధనలు ఉన్నాయన్నారు. కానీ, ప్రజల కోసం నిత్యం పని చేసే ప్రజా సంఘాల నాయకులకు బేడీలు వేయటం చట్ట విరుద్ధమన్నారు. పేదల ప్రాథమిక హక్కుగా ఇల్లు కావాలని అనేక ఉద్యమాలు చేస్తున్నారని.. ఎక్కడా బేడీలు వేసి కోర్టుకి హాజరు పరిచిన చరిత్ర లేదన్నారు. ప్రజాస్వామ్యం మా జన్మహక్కు అని గొప్పలు పలికిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు నెలలు పూర్తి కాకముందే ప్రజా సంఘాల నాయకులను అణచివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. వెంటనే బేషరతుగా నాయకులకు క్షమాపణలు చెప్పి విడుదల చేయాలని, బేడీలు వేసిన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జగిత్యాల జిల్లాలో పేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని.. గుడిసెలు వేయించి భూపోరాటం చేస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌ చేసిన పోలీసులు.. మంగళవారం వారికి నేరస్థులకు వేసినట్టు బేడీలు వేసి కోర్టుకు తరలించారు. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, సీపీఐ(ఎం) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలను ఖండించారు.

Spread the love