రైతుకు బేడీలు

Bedis for the farmer– పోలీసుల తీరుపై సీఎం సీరియస్‌
– సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో లగచర్ల అన్నదాతకు గుండెపోటు
– గతంలోనే గాంధీలో వైద్య పరీక్షలు చేయించిన జైలు సిబ్బంది
– ఇంటి వద్ద ఉన్నపుడే అనారోగ్యం
– బేడీలతో ఆస్పత్రికి తరలించిన పోలీసులు
నవతెలంగాణ – మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి, సంగారెడ్డి
ఫార్మా సిటీ భూ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్‌పౖౖె జరిగిన దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లగచర్ల రైతుకు గుండెపోటు వచ్చింది. రైతు హీర్యా నాయక్‌ జైల్లో అనారోగ్యం పాలవడంతో వైద్య పరీక్షలు చేస్తుండగా గుండెపోటు వచ్చిందన్న విషయం గుర్తించారు. దాంతో జైలు సిబ్బంది బుధవారం రాత్రి హుటాహుటిన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మూడు రోజుల ముందే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన జైలు సిబ్బంది వైద్య పరీక్షలు చేయించి తీసుకువచ్చారు. మళ్ళీ బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు హీర్యా నాయక్‌కు ఈసీజీ, 2 డీ ఏకో పరీక్షలు చేశారు. గత నెల 11న వికారాబాద్‌ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ హీర్యా నాయక్‌ గతంలోనే తనకి గుండె సమస్య ఉన్నట్టు వెల్లడించారు. మూడు నెలల కిందే ఇంటి వద్ద ఆస్పత్రికి వెళ్లగా స్టంట్‌ వేయాలని వైద్యులు చెప్పారని, తన ఆర్థిక పరిస్థితుల వల్ల సర్జరీ చేయించుకోలేదని తెలిపారు.
రైతుకు సంకెళ్లు సరికాదు : చింత ప్రభాకర్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే
లగచర్ల రైతుకు గుండెపోటు వచ్చి చావు బతుకుల్లో ఉంటే సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడం దారుణమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ అన్నారు. సంఘటన తెలవగానే ఆయన ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటే రైతులను జైల్లో పెట్టడం, సంకెళ్లు వేయడమా అని ప్రశ్నించ్చారు.
అన్యాయం
లగచర్ల దాడి కేసులో సంగారెడ్డి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రైతుకు ఛాతీనొప్పి వస్తే కనీస మానవత్వం లేకుండా బేడీలు వేసి తీసుకెళ్లడం దారుణం. రైతు హీర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
అంత అవసరమేంటీ!
– కరుడగట్టిన నేరస్తుని మాదిరి సంకెళ్లా…?  తక్షణమే విచారణ చేసి నివేదిక ఇవ్వండి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రిమాండ్‌ ఖైదీ లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు గుండెపోటు వస్తే అతనికి ఖైదీకి వేసిన మాదిరిగా బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం మీడియాలో రావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఘటనపై అధికారుల ద్వారా సమాచారం తెలుసుకొని జైలు అధికారులఫై సీరియస్‌ అయ్యారు. రిమాండ్‌ ఖైదీకి బేడీలు వేయాల్సిన అవసరం ఏముందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిందితునికి గుండెపోటు వచ్చి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం రైతు అని కూడా చూడకుండా, కరుడుగట్టిన నేరస్తుని మాదిరి సంకెళ్లు వేయడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జైలు సిబ్బంది తీరు పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Spread the love