అంతిమయాత్రపై తేనెటీగల దాడి

 – 20 మందికి గాయాలు
నవతెలంగాణ- గంగాధర : గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని స్మశాన వాటిక వద్ద మృతదేహాన్ని తీసుకెళుతున్న మృతుడు బంధువులు, గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రేణికుంట తిరుపతి గుండెపోటుతో మరణించగా మృతదేహాన్ని అంతిమయాత్రగా తీసుకొస్తూ వైకుంఠ ధామం వరకు చేరారు. మృతదేహాన్ని రథంపై నుండి కింది దింపి దహనం చేయడానికి తీసుకెళ్తుండగా, మృతదేహం మెాసే బంధువులు, దహన సంస్కారాలకు తరలివచ్చిన గ్రామస్తులపై ఒక్కసారిగా తేనేటీగలు దాడికి దిగాయి. టపాసులు పేలుస్తూ మృతదేహాన్ని అంతిమయాత్రగా తీసుకొస్తుండగా వైకుంఠధామం సమీపంలోని చెట్లపై ఉన్న తేనెటీగలు లేచి మృతుడి బంధువులు, గ్రామస్తులపై దాడి చేశాయి. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి స్నాన గదులు, విశ్రాంతి గదిలోకి దూరి మృతుడు బంధువులు తలదాచుకున్నారు. ఈ దాడిలో 20 మందికిపైగా గాయపడ్డారు. రేణికంట బాలాజీ, గుండా రాజేశం, బొల్లబత్తిని నరసయ్యతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మృతుడి బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఈ అంతిమయాత్రకు సుమారు 200 మంది వరకు హాజరు కాగా, తేనెటీగలు దాడికి దిగడంతో పరుగులు తీశారు. మృతదేహంపై అత్తరు చల్లడం, టపాసులు పేల్చడం వల్లే తేనెటీగలు చెట్లపై నుండి లేచి దాడి చేశాయని మృతుడి బంధువులు వివరించారు.

Spread the love