నవతెలంగాణ-పెద్దవంగర: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు బిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పసుల స్వరూప మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెగ్యులరేషన్, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రతలాంటి విషయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదవి విరమణ పొందే ఉద్యోగులకు గ్రాట్యూటీ, పెన్షన్ సౌకర్యాన్ని తెలంగాణలో కూడా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లకు టీఏ, డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పటివరకు పెంచుకోవడం శోషణీయం అన్నారు. ఆన్లైన్‌యాప్‌ల వల్ల రోజురోజుకూ పనిభారం పెరిగిందని, వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు. అనేకసార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు మంజుల, రేణుక, అంబిక, మమత, యాదమ్మ, యాకలక్ష్మీ, ఎల్లమ్మ, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.