ఘర్షణకు పాల్పడిన ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులకు శిరోముండనం!

నవతెలంగాణ – అమరావతి: విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఘర్షణ పడడం పట్ల యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. విద్యార్థులను కర్రలతో దండించడంతోపాటు శిరోముండనం చేయించింది. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగిన ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కాలేజీలో ఇంటర్ సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి పరస్పరం దాడి చేసుకున్నారని సమాచారం. అయితే ఈ ఘర్షణలో పాల్గొన్న విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. కాలేజీ సిబ్బంది విద్యార్థులను కర్రలతో తీవ్రంగా కొట్టారని, ఆరుగురికి శిరోముండనం చేయించారని సమాచారం. కాలేజీ సిబ్బంది దండించడంతో విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయని, ఒకరికి చెయ్యి విరిగిందని తెలుస్తోంది. ఈ వ్యవహారం నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Spread the love