తెర వెనుక..!

Behind the scenes..!– వినోద పరిశ్రమలో అంతా విషాదమే
– వేళాపాళా, నిద్రాహారాలుండవు
– పొట్ట నిండాలంటే నిర్విరామంగా పని చేయాల్సిందే
– నిబంధనల ఊసే లేదు
– ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోరు
– జూనియర్‌ ఆర్టిస్టులు, సిబ్బందిపై వివక్ష
దేశంలో ఉద్యోగ సంక్షోభానికి నిరుద్యోగం మాత్రమే కారణం కాదు. చాలా మందికి కనీస పని గంటలు అనేవి కాగితాలకే పరిమితం. ఏ పరిశ్రమలో చూసినా, ఏ సంస్థలో చూసినా శ్రమ దోపిడీయే కన్పిస్తుంది. పని ప్రదేశాలలో దుర్భర పరిస్థితులు తాండవిస్తుంటాయి. ఇష్టమున్నా లేకున్నా పొట్ట నిండాలంటే పని చేయాల్సిందే. మరి నిర్విరామంగా 27 గంటలు పని చేయాల్సి వస్తే…ఆలోచించడానికే భయం వేస్తుంది. ముంబయిలోని వినోద పరిశ్రమలో ఇలాంటి దృశ్యాలే మనకు కన్పిస్తాయి. కాస్త విరామం లభిస్తే… పడుకోవడం, మళ్లీ షూటింగ్‌కు సిద్ధపడడం సర్వసాధారణంగా జరిగేదే. నెలకు కేవలం రెండు రోజులు మాత్రమే విశ్రాంతి. మిగిలిన దినాలలో ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో వారికి అనవసరం. రోజంతా పని…పని…పని…
న్యూఢిల్లీ:
ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సినీ పరిశ్రమలో కార్మికులకు అన్నీ కష్టాలు, కడగండ్లే. క్షేత్ర స్థాయిలో నిబంధనలంటూ ఏవీ ఉండవు. వారి భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునే నాథుడే ఉండడు. అధిక పని ఒత్తిడి, కాలంతో సంబంధం లేని షెడ్యూల్స్‌ కార్మికులకు, చిన్నా చితకా ఉద్యోగులకు విశ్రాంతి అనేదే లేకుండా చేస్తాయి. సినీ, టీవీ పరిశ్రమలోనే కాదు…యాడ్స్‌ రూపకల్పనలోనూ అదే పరిస్థితి. ఓ వ్యాపార ప్రకటనను రూపొందించేందుకు అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేస్తున్న ఒక మహిళ రెండు రోజులలో…అంటే 48 గంటలలో ఏకంగా 38 గంటల పాటు నిర్విరామంగా షూటింగ్‌ చేశారు. ప్రీ-షూట్స్‌ ఒత్తిడితో మరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనారోగ్యం బారిన పడ్డారు.
కాంట్రాక్ట్‌ కుదిరితే అంతే
నటీనటులకు కూడా ఈ బాధలు తప్పవు. ఆరోగ్య బాగా లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే సిబ్బంది అంతా సిద్ధంగా ఉంటారు. నిజమైనా, కుంటిసాకు అయినా తేలికగానే తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితులలో పనిని, జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యాపార ప్రకటనల తయారీ కోసం పనిచేసే నటీనటులు, ఇతర సిబ్బందికి ఒక్కోసారి పనే ఉండదు. గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రకటనలకు సంబంధించి కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అప్పుడు వారికేమీ పని ఉండదు. కాంట్రాక్ట్‌ కుదిరిందంటే ఇక అంతే….దానిని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో నిబంధనలంటూ చెప్పినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఉదాహరణకు పనిలో క్రియేటివిటీ చూపే వారు 12 గంటలకు మించి ఎక్కువ సమయం పని చేయకూడదు. ఒకవేళ చేస్తే ఓవర్‌టైమ్‌ అలవెన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనిని ఎవరూ పట్టించుకోరు.
వీరి గోడు వినేదెవరు?
వ్యాపార ప్రకటనల పరిశ్రమలో ఉండేది ఒకే నిబంధన…నిర్ణీత బడ్జెట్‌లో పని పూర్తి చేయాలి. అంతే. కోవిడ్‌ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అది ఇప్పటికీ కుదుటపడలేదు. తాను ఇటీవల ఓ సెట్‌లో పనిచేశానని, ఏడు యాడ్‌ ఫిల్మ్‌లను రూపొందించడానికి సిబ్బంది 27 గంటల పాటు అలుపెరుగకుండా పని చేశారని నటీమణి, దర్శకురాలు దివ్య ఉన్నీ చెప్పారు. ‘ఈ పరిశ్రమలో పోటీ ఎక్కువ. బడ్జెట్‌ను బట్టి పని పూర్తి కావాలి. తప్పదు. అలాంటప్పుడు భౌతిక, మానసిక ఆరోగ్యంతో రాజీ పడాల్సిందే. ఆరోగ్యం దెబ్బతింటే ఎవరూ పట్టించుకోరు. పరిహారం ఇవ్వరు’ అని తెలిపారు. దివ్య ఇటీవల ఓ తేయాకు కంపెనీ కోసం 22 గంటల పాటు ఏకధాటిగా పనిచేశారు. భోజనం చేయడానికి కేవలం 40 నిమిషాల విరామం మాత్రమే దొరికింది. సీనియర్‌ అయిన తన పరిస్థితే ఇలా ఉంటే జూనియర్‌ ఆర్టిస్టుల సంగతేమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆ ప్రకటనకు 20 మంది జూనియర్‌ ఆర్టిస్టులు అవసరమయ్యారు. వారు ఆరు గంటల పాటు వర్షంలో నిలబడాల్సి వచ్చింది. వారికి మధ్యలో వేడి వేడిగా తినడానికి ఏమైనా ఇచ్చారా అంటే లేదు. తడిసిన బట్టలు మార్చుకునేందుకు పొడి బట్టలు కూడా ఇవ్వలేదు. వారి అవసరం కూడా లేదన్న విధంగా ప్రవర్తించారు. చివరికి బాగా ఇబ్బంది పడేది జూనియర్‌ ఆర్టిస్టులే. ఎందుకంటే వారు పేరున్న వారు కాదు. వారిని ఎవరూ పెద్దగా గుర్తించరు’ అని వివరించారు. షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగి చనిపోయినా దిక్కు లేదని ముంబయికి చెందిన ఓ కెమేరామన్‌ వాపోయారు. కార్మిక సంఘాలు కూడా వీరిని గురించి పెద్దగా పట్టించుకోవు. పని దొరికే అవకాశాలు పరిమితంగా ఉండడంతో ఎన్ని బాధలైనా పడేందుకు ఆర్టిస్టులు, సిబ్బంది సిద్ధపడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు కావాలి. అందుకోసం రోజుకు 22 గంటలైనా పని చేసేందుకు ముందుకు వస్తారు. పోనీ గౌరవం అయినా ఉంటుందా అంటే అది ఎండమావే. ఛీత్కారాలు, అవమానాలు, లైంగిక వేధింపులు తప్పవు. దక్షిణాదిన పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని, కానీ బాలీవుడ్‌లో కాలాన్ని డబ్బుగా భావిస్తారని అంటూ ఓ ఆర్టిస్ట్‌ నిట్టూర్పు విడిచారు. రోజుకు 18 గంటలు పనిచేసే సిబ్బందికి ఇచ్చేది రూ.1,200 నుండి రూ.1,600 మాత్రమే.
వివక్ష ఎక్కువే
ఇక వివక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్‌ ఆర్టిస్టులకు రాచమర్యాదలు లభిస్తాయి. అదే జూనియర్‌ ఆర్టిస్టులు, సాంకేతిక సిబ్బందిని చిన్నచూపు చూస్తారు. భోజనం విషయంలోనూ తారతమ్యాలు ఉంటాయి. మౌలిక సదుపాయాల విషయంలోనూ వివక్ష కన్పిస్తుంది. సీనియర్‌ నటీనటులకు ప్రత్యేకంగా వానిటీ వ్యాన్లు ఉంటాయి. వాటిలోనే వాష్‌రూమ్స్‌ ఉంటాయి. కానీ ఇతర మహిళలకు అలాంటి సదుపాయాలేవీ ఉండవు. టీవీ రంగంలో మహిళలు నిర్మాతలుగా, ఎగ్జిక్యూటివ్‌లుగా రాణిస్తున్నప్పటికీ తోటి వారికి కనీస వసతులు కూడా కల్పించరు. అసిస్టెంట్‌ డైరెక్టర్లు, లైట్‌మెన్‌లకు తమ సామానులు పెట్టుకునే స్థలం కూడా ఉండదు. డబ్బు ఆదా చేసుకునేందుకు కొందరు నిర్మాతలు నాసిరకం ఆహారాన్ని అందిస్తుంటారు. లైట్‌మెన్‌, స్పాట్‌ బార్సు పరిస్థితి అయితే మరీ ఘోరం. సెట్స్‌లో కాసింత జాగా చూసుకొని తినాల్సి వస్తుంది. ‘ఇంటికి ఎప్పుడు తిరిగొస్తామో తెలీదు. సెట్‌లో ఎప్పుడు ఉండాలో మాత్రమే మాకు తెలుస్తుంది. అంతా నిర్మాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. షిఫ్ట్‌ని పొడిగిస్తే దానికి అంగీకరించి పని చేయాల్సిందే’ అని ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ వాపోయారు.

Spread the love