నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కూలీలపై ఒడిశాలో దాడి జరిగింది. ఒక గుంపు వారితో బలవంతంగా బట్టలు విప్పించారు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తనపై కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అర్ధ నగ్నంగా ఊరేగించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెంగాల్‌కు చెందిన ఎనిమిది మంది వలస కూలీలు ఒక గ్రామంలో నివసిస్తున్నారు. కాగా, ఒక కూలీ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని గ్రామానికి చెందిన మహిళ ఆరోపించింది. దీంతో ఆమె వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు 8 మంది బెంగాల్ కూలీలను చుట్టుముట్టారు. బలవంతంగా వారితో దుస్తులు విప్పించారు. తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అర్ధ నగ్నంగా ఆ గ్రామంలో ఊరేగించారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గుంపు చెర నుంచి బెంగాల్ కూలీలను రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారి నుంచి ప్రతిఘటన ఎదురైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.