ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి

నవతెలంగాణ- హైదరాబాద్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు గ్రీన్‌ జెర్సీ మరోసారి అచ్చిరాలేదు. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. చివరి రెండు బంతులకు మూడు పరుగులు చేస్తే విజయం సొంతమయ్యేది. కానీ 19.5 బంతికి కరన్‌ సింగ్ ఔటవ్వగా.. చివరి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించి ఫెర్గూసన్‌ కూడా ఔటయ్యాడు. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో బెంగళూరుపై కోల్‌కతా విజయం సాధించింది. దీంతో జాక్స్‌, రజత్‌ పాటిదార్‌ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ లాభం లేకుండా పోయింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన కోల్‌కతా బ్యాటర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ చెలరేగి ఆడాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4.2 ఓవర్‌ వద్ద సిరాజ్‌ వేసిన బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో మిస్‌ చేసుకున్నాడు. మరో ఓపెనర్‌ సునీల్ నరైన్‌ 10 పరుగులకే ఔటయ్యాడు. సాల్ట్‌, నరైన్‌ తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(3), వెంకటేశ్‌ అయ్యర్‌ (16) ప్రభావం చూపించలేకపోయారు. కానీ శ్రేయాస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌ దూకుడుగా ఆడుతూ జట్టుకు కీలక స్కోర్‌ అందించారు. కానీ 13.1 ఓవర్‌లో రింకూ సింగ్‌ (24) కూడా ఔటయ్యాడు అయినప్పటికీ శ్రేయాస్‌ అయ్యర్‌ నిలకడగా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే పెవిలియన్‌కు చేరాడు. చివరలో ఆండ్రీ రస్సెల్‌ (27), రమణ్‌దీప్‌ సింగ్‌ (24) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 222 పరుగులను సాధించింది. బెంగళూరుకు 223 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారీ టార్గెట్‌తో చేధనకు దిగిన బెంగళూరు జట్టు ఆరంభంలోనే తడబాటుకు గురైంది. పవర్‌ ప్లే పూర్తయ్యే లోపే విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) పెవలియన్‌కు చేరారు. మూడో ఓవర్‌లో మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ (18) ఔటయ్యాడు. హర్షిత్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చాడు. దీనిపై కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ ఔట్‌గానే తేలింది. దీంతో అసహనంగా కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. నాలుగో ఓవర్‌లో తొలి బంతికే డుప్లెసిస్‌ కూడా ఔటయ్యాడు. కోహ్లీ, డుప్లెసిస్‌ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జాక్స్‌ (55), రజత్‌ (52) దూకుడుగా ఆడారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. అయితే 12వ ఓవర్‌ నుంచి ఆర్బీబీకి కష్టాలు మొదలయ్యాయి. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి రెండు ఓవర్లలోనే ఆర్సీబీ 4 వికెట్లను సమర్పించుకుంది. 12వ ఓవర్‌లో తొలి బంతిలో జాక్స్‌ (55) ఔటవ్వగా.. నాలుగో బంతికి రజత్‌ (52) హర్షత్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13వ ఓవర్‌లో మూడో బంతికి గ్రీన్‌ (6).. చివరి బంతికి లామ్రార్‌ (4) ఔటయ్యారు. మ్యాచ్‌ చేజారిపోతుందేమోనని అనుకున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన ప్రభుదేశాయ్‌ (24), దినేశ్‌ కార్తిక్‌ (25) ఉత్సాహం నింపారు. కానీ అది ఎక్కువసేపు కొనసాగలేదు. 18వ ఓవర్‌లో రెండో బంతికి ప్రభుదేశాయ్‌ ఔటవ్వడంతో బెంగళూరు మళ్లీ సందిగ్ధంలో పడింది. అయినప్పటికీ దినేశ్‌ కార్తిక్‌ ఒంటరిపోరుతో విజయతీరాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ 19 ఓవర్‌లో దినేశ్‌ కార్తిక్ ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరలో రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి సమయంలో కరన్‌ శర్మ (20) ఔటయ్యాడు. చివరి బంతికి ఫెర్గూసన్‌ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలయ్యింది.

Spread the love