– మిత్రధర్మం పాటించకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన
– మేం కుమిలిపోయేది లేదు, సవాల్‌గా తీసుకుంటాం
– అసెంబ్లీ ఎన్నికల్లో
– కమ్యూనిస్టుల సత్తాచాటుతాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పొత్తుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర క్షమించరాని తప్పు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విలువలు కాకుండా రాజకీయమంటే నమ్మకద్రోహం అనేలా చేశారని అన్నారు. మిత్రధర్మం పాటించకుండా ఏకపక్షంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. ఈ పరిణామాలకు తాము కుమిలిపోయేది లేదనీ, సవాల్‌గా తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. కమ్యూనిస్టు పార్టీని మరింత కసితో పటిష్టం చేస్తామనీ, గెలిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో రెండు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ, కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, ఈటి నర్సింహాలతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ఇంతకాలం తాము మిత్ర పక్షంగా ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే స్నేహపూర్వకంగా సలహాలిచ్చామని గుర్తు చేశారు. రాబోయే కాలంలో సమరశీల పోరాటాలను నిర్వహిస్తామన్నారు. అయితే ఇతర పార్టీల్లాగా తాము వ్యక్తిగతంగా తిట్టబోమనీ, విధానపరంగానే విమర్శలు చేస్తామన్నారు. అయితే కమ్యూనిస్టులు మిత్రధర్మం మరిచారంటూ ఓ పత్రికలో వచ్చిందని చెప్పారు. ఇది దొందే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. 2004, 2009లో టీఆర్‌ఎస్, సీపీఐ ఒకే కూటమిలో ఉన్నాయని గుర్తు చేశారు. అయినా 2004లో వెన్నుపోటు పొడుస్తూ సీపీఐకి కేటాయించిన నల్లగొండ ఎంపీ స్థానంలో సురవరం సుధాకర్ రెడ్డి, ఇందుర్తిలో చాడ వెంకట్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థులను పోటీ పెట్టిందని విమర్శించారు. 2009లో హుస్నాబాద్‌లో చాడపై టీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ చేశారని వివరించారు. మిత్రద్రోహం చేసిందేవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు మొట్టమొదటి రాజ్యసభ స్థానం ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ కె కేశవరావు తనతో సహా సీపీఐకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతుతో గెలిచారని గుర్తు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ప్రకటించినా ఆర్టీసీ సమ్మెతో ఉపసంహరించుకున్నామనీ, తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో, ఖమ్మంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధుకు మద్దతిచ్చామని వివరించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని అన్నారు. అయితే నిమిష నిమిషానికి వైఖరి మార్చుకున్నది కేసీఆరే తప్ప తాము కాదన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సీపీఐ, సీపీఐ(ఎం) ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉంటుందన్నారు. కేవలం సీపీఐకే పది వేల ఓట్లు వచ్చే స్థానాలు 30 నుంచి 40 వరకు ఉంటాయని చెప్పారు.
తెలంగాణ విలీనాన్ని అధికారికంగా జరపాలి
తెలంగాణ విలీన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూనంనేని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నా అధికారికంగా ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. అయితే తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జెండా ఎగరేయడం, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం ద్వంద్వనీతికి నిదర్శనమని విమర్శించారు. వచ్చేనెల 17న అధికారికంగా జరపాలని కోరారు. వచ్చేనెల 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయుధ పోరాట కేంద్రాలకు బస్సుయాత్ర నిర్వహిస్తామన్నారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘కమ్యూనిస్టుల సాయుధ పోరాటమే లేకుంటే తెలంగాణ మరో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయ్యేదని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక తరహాలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విలీన దినోత్సోవాన్ని నిర్వహించి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. నాటి పోరాట స్మారకాన్ని, స్మృతి వనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.