– ఆర్థిక సంస్కరణలతో గతంలో వృద్ధి
– అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్: కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతి: రానున్న రోజుల్లో నాలుగు ‘పి’లతో ముందుకు వెళ్లాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సమావేశం సోమవారం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సదస్సును ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. సదస్సు ప్రారంభం నుండి చివరి వరకు సమావేశంలోనే ఉన్న ఆయన వివిధ సందర్భాల్లో కూడా జోక్యం చేసుకుని మాట్లాడారు. సదస్సు ప్రారంభంలో గతంలో తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్తులో ప్రాధాన్యతలను, పాలన సాగే తీరును కలెక్టర్లకు వివరించారు. గతంలో అమలు చేసిన పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్ విధానాన్ని ప్రస్తావించిన ఆయన, ఆ విధానంతో మంచి అభివృద్ధిని సాధించామని చెప్పారు. ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్టనర్‌షిప్ (నాలుగు ‘పి’లు) విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు ఈ విధానాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని, మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం ద్వారా గతంలో మంచి పలితాలు సాధించినట్లు చెప్పారు. ‘రాష్ట్రంలో కాంపిటేటివ్ గ్రోత్ వచ్చింది’ అని చెప్పారు. ఇప్పుడు కూడా మెరుగైన పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అక్టోబర్ రెండవ తేదీన విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.