– పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు
– పలువురు మంత్రులు ఓడారు
– పరాజయాలతో భారీగా తగ్గిన సీట్లు
– ఇక వారణాసికే పరిమితంకండి
– మోడీకి రాజకీయ విశ్లేషకుల సూచన
న్యూఢిల్లీ : కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీకి ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈసారి మాత్రం ఆయనకు తీవ్ర ఆశాభంగమే కలిగించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీని కనీసం మ్యాజిక్ ఫిగర్ వరకూ చేర్చలేకపోయాయి. ఎన్డీఏ సైతం పూర్తి ఆధిక్యత కనబరచలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిలో కొనసాగే నైతిక, రాజకీయ హక్కు మోడీకి లేదని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నూతన నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ తన పేరును ఉపయోగిం చుకుంటూనే ఈ ఎన్నికల్లో పోరాడారు. తన పేరు చెప్పుకునే ఓట్లు అభ్యర్థించారు. ఆయన పార్టీ మ్యానిఫెస్టోకి సైతం ‘మోడీ కీ గ్యారంటీ’ అని పేరు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ అంతా తానై చక్రం తిప్పారు. కాబట్టి పార్టీ పరాజయాలకు కూడా ఆయనే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీజేపీ మ్యానిఫెస్టోలో మోడీ అనే పదం 67 సార్లు కన్పించింది. ఎంతగా మోడీ నామజపం చేసినప్పటికీ మెజారిటీకి అవసరమైన 272 సీట్లకు బీజేపీ చేరుకోలేక పోయింది. 2019లో గెలుచుకున్న స్థానాలను గణనీయంగా కోల్పోయింది.
మంత్రుల పరాజయం
ఈ ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు మట్టి కరిచారు. స్మృతి ఇరానీ, అజరు మిశ్రా తెనీ, అర్జున్ ముండా, కైలాష్ చౌదరి, సంజీవ్ బాల్యన్, మహేంద్ర నాథ్ పాండే, కౌశల్ కిషోర్, రాజీవ్ చంద్రశేఖర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, భాను ప్రతాప్ సింగ్ వర్మ, కలిప్ మోరేశ్వర్ పాటిల్, ఆర్కే సింగ్, వి.మురళీధరన్, ఎల్.మురుగన్, రావుసాహెబ్ దాదారావు దాన్వే, సుభాష్ సర్కార్ పరాజయం పాలయ్యారు. మంత్రుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయిన నేపథ్యంలో వారితో పాటు ప్రధాని కూడా పదవిని త్యజించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అయోధ్యలోనూ తప్పని ఓటమి
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దేశ రాజకీయాలకు ఆ నగరాన్ని కేంద్ర బిందువుగా మార్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిర్మాణంలో ఉన్న దేవాలయంలో బాలరాముడి విగ్రహానికి జనవరిలో ప్రాణప్రతిష్ట చేశారు. ఆ కార్యక్రమానికి అతిరథ మహారథులను ఆహ్వానించారు. ఇంత చేసినా అయోధ్య రాముడు దయ తలచలేదు. అక్కడే (ఫైజాబాద్) బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిర నిర్మాణానికి విశేష ప్రాచుర్యం కల్పించిన ప్రధానిని యూపీ ప్రజలు తిరస్కరించారు.
ఆగిపోయిన విజయాల ప్రయాణం
నరేంద్ర మోడీ విజయాల ప్రయాణం దశాబ్దం క్రితం యూపీ నుండే ప్రారంభమైంది. యూపీ ప్రజల నిరాదరణతో ఇప్పుడది ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతే అలహాబాద్‌లోని త్రివేణీ సంగమంలో అంత్యక్రియలు జరిపారు. ఆ మరణాల లెక్క ఇప్పటి వరకూ బయటికి రాలేదు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా అలహాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 58,795 ఓట్ల తేడాతో బీజేపీ ఓడింది. యూపీలో 2014లో 71 స్థానాలు, 2019లో 62 స్థానాలు గెలుచుకున్న బీజేపి ఇప్పుడు 33 సీట్లకే పరిమితమైంది. కేంద్రంలో సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 30 సీట్లు తక్కువ పడ్డాయి.
అక్కడా పరాజయాలే
యూపీలోనే కాదు…పలు హిందీ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. రాజస్థాన్‌లోని బన్స్వారాలో మోడీ చేసిన విద్వేష ప్రసంగం గుర్తుండే ఉంటుంది. అక్కడి ప్రజలు మోడీని తిరస్కరిస్తూ కాంగ్రెస్‌కు 2.47 లక్షల ఓట్ల మెజారిటీని అందించారు. మణిపూర్‌లో జాతుల మధ్య చెలరేగిన హింసాకాండ కూడా బీజేపీ ఓటమికి కారణమైంది. ఆ రాష్ట్రంలోని రెండు స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ సుమారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది. మణిపూర్ హింసపై మోడీ ప్రదర్శించిన ఉదాశీనతను అక్కడి ప్రజలు క్షమించలేకపోయారు.
నవ్విన నాపచేనే పండింది
అమేథీలో అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్ తాత్సారం చేసింది. అప్పుడు రాహుల్‌ను ఉద్దేశించి మోడీ ‘భయపడవద్దు’ అంటూ అపహాస్యం చేశారు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ అమేథీలో కిషోర్లాల్ను బరిలో దింపింది. ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని 1,67,196 ఓట్ల అధిక్యతతో ఓడించారు. వారణాసిలో మోడీకి వచ్చిన మెజారిటీ కంటే ఇది ఎక్కువే.
వారణాసికే పరిమితమైతే మంచిది
మోడీ తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఓటమి చవిచూడలేదు. గుజరాత్ శాసనసభలో ఆయన ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టారు. పార్లమెంటులోనూ ప్రధానిగా ప్రవేశించారు.
అలాంటి నాయకుడికి తొలిసారిగా ఇప్పుడు చేదు అనుభవం ఎదురైంది. ఒకప్పుడు ‘సంకీర్ణం’ అంటే బలహీనమైనదని చెప్పిన మోడీ ఇప్పుడు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. వాటి దయాదాక్షిణ్యా లతో ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోంది. ఎప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం వస్తే అప్పుడు మోడీ కాళ్ల కింద పీఠం కదిలిపోతుంది. దీనిని నివారించడానికి కూడా మోడీ ముందున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ….ప్రధాని పదవి నుండి వైదొలిగి, వారణాసికే పరిమితమై రాబోయే ఐదు సంవత్సరాలు నియోజక వర్గ అభివృద్ధి కోసం పని చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.