సామాజిక ఉద్యమ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ

సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరి గౌరీ శంకర్‌
నవతెలంగాణ-కల్చరల్‌
నైజాం ఏలుబడిలో సామాజిక సమస్యలపై ఉద్యమించిన వైతాళికుడు భాగ్య రెడ్డి వర్మ అని సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరి గౌరీ శంకర్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఎస్సీ అభివృద్ధి శాఖ, ఆది హిందూ సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ నిర్వహణలో సోమవారం భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరి మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ 18వ ఏటనే సాంఘిక దురాచారాలు, అంటరానితనంపై గళమెత్తి అంబెద్కర్‌ కన్నా ముందే వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి తోడ్పడ్డారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఎస్టీ, ఎస్సీ ఆల్‌ ఇండియా నాయకులు మురళీధరరావు, రాజు ఉస్తాద్‌ను భాగ్యరెడ్డి వర్మ స్మారక పురస్కారాలతో సత్కారించారు. రాష్ట్ర గిడ్డంగులు సంస్థ చైర్మెన్‌ సాయి చంద్‌, ఎస్సీ అభివృద్ధి సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సుధా రాణి, జ్ఞాన ప్రకాష్‌, దళిత ఉద్యమ నాయకులు జ్ఞానేశ్వర్‌, అజరు గౌతమ్‌, శ్రీలత గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love