– అల్లాడిపోతున్న ప్రజలు
– శీతలపానీయాలతో సేద తీరుతున్న వైనం
– నాగోల్ డివిజన్‌లో
– బస్ షెల్టర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు
నవతెలంగాణ -నాగోల్
మండుతున్న ఎండలతో వీస్తున్న గాలులకు వచ్చే వేసవి తాపంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతున్న ఎండలు సాయంకాలం 6 గంటల వరకు కాస్తునే ఉంటుంది. దీంతో వచ్చే వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటిందంటే వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు వర్షం పడుతున్నా వేడి మ్తాత్రం తగ్గడం లేదు. దాంతో వివిధ పనుల కోసం బయటకు వచ్చే వారు వేసవి తాపానికి తట్టుకోలేక శీతల పానీయాలను సేవించి తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. మరి కొంత మంది వేడి గాలుల కు వచ్చే ఉక్క పోతను తట్టుకోలేక ఈత కొలను లను ఆశ్రయించి చల్లదనం పొందుతున్నారు. అయితే ఈ వేసవిలో మధ్యాహ్నం ఒంటిగంట దాటిందంటే మండు తున్న ఎండలకు జనం లేక కొన్ని రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
నాగోల్ డివిజన్‌లోని కొన్ని బస్ స్టాప్‌లలో బస్ షెల్టర్లు లేక నిలువ నీడ కరువై బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు మండుతున్న ఎండలకు అల్లాడిపోతున్నారు. వేసవికాలం దష్టిలో పెట్టుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఎండల్లో దాహంతో అల్లాడుతున్న వారి దాహార్తిని తీర్చుతున్నాయి. చలివేంద్రాలు లేని చోట్ల ప్రజలు శీతల పానీయాల సెంట ర్లను ఆశ్రయించి వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి శీతలపా నియాలను తీసుకొని తమ దప్పికను తీర్చుకుంటున్నారు.
రోజువారి కూలీలు కూడా ఎండలో పనికి వెళ్ళితే ఎక్కడ అనారోగ్యాలకు గురికాల్సి వస్తుందోనని జింకుతున్నారు. రోడ్లపై వ్యాపారుల నిర్వహిస్తు జీవనోపాధి పొందుతున్న వివిధ చిరు వ్యాపారస్తుల కష్టాలు కూడా వర్ణనాతీతం. ఒకవైపు పెట్టుబడులు పెట్టి తెచ్చిన సరుకులను ఎండల నుంచి కాపాడుకోవడం, మరోవైపు మండుతున్న ఎండల్లో కూర్చొని కొనుగోలుదారుల కోసం వేచి చూస్తూ వ్యాపారం చేసుకోవడం గగనంగా మారిందంటున్నారు. ఎండల భయానికి వినియోగదారులు కూడా అంతగా లేకపో వడంతో నమ్ముకున్న వ్యాపారం కూడా సక్రమంగా జరగడం లేదని వాపోతున్నారు. ఏదేమైనా వేసవికాలం ముగిసే వరకు మధ్యాహ్నం వేళలో పని ఉంటే తప్ప బయటకి వెళ్ళొద్దని ,తప్పనిసరి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.