ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రశాంతం

నవతెలంగాణ- రాయపోల్ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగించడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి బాధ్యులు బ్యాగరి స్వామి అన్నారు. బుధవారం రాయపోల్ మండల పరిధిలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారం లేదని పార్లమెంటరీ విధానంలో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం తర్వత సుప్రీంకోర్టు వర్గీకరణ చేసే అధికారం ఉంటుందన్నారు. ఈ వర్గీకరణ తీర్పును రాజకీయకుటలో భాగంగానే వచ్చిందన్నారు. బిజెపి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మందకృష్ణ మాదిగకు ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించే విధంగా బిజెపి ఆలోచనను తప్పుపడుతున్నామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు, ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల ఐక్యమత్యానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పును భావించాల్సి వస్తుందన్నారు. దేశంలో ఐక్యంగా ఉన్న ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడదీయడం కోసమే ఈ తీర్పు వర్తిస్తుందన్నారు. దళిత బహుజనలు కులాలు ఉప కులాలుగా విడిపోతే రాజ్యాధికారం అసలు లక్ష్యాన్ని సాధించలేమన్నారు. దేశంలో 85 శాతం జనాభా ఉన్న దళిత బహుజనలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధిస్తామన్నారు. ఎస్సీ జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని ప్రతి రాష్ట్రంలో జనాభాలో వ్యత్యాసం ఉంటుందని రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారన్నారు. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజాసంఘాలు పోరాటం చేస్తున్నాయని సుప్రీంకోర్టు తీర్పుపై పునసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు బాలకృష్ణ, పుట్ట నవీన్, కరుణాకర్, దేవరాజ్, బ్యాగరి నవీన్, శ్రీకాంత్, బైండ్ల నవీన్, విష్ణు, సతీష్, చింటూ, రమేష్, వంశీ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love