భగ్గుగనులు

Bhaggu mines– కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్న కేంద్రం
– వేలం పేరుతో ఒక్కో గని ప్రయివేటు పరం
– పరిరక్షణకై సాగుతున్న సీపీఐ(ఎం) యాత్ర
– నేడు పెనుబల్లి-సత్తుపల్లిలో ర్యాలీ.. కొత్తగూడెంలో ముగింపు సభ
”భూమి పొరల్లో మాగాణి.. తెలంగాణ వెలుగుల జనని.. శ్రామిక జన సంజీవిని.. మన సింగరేణి..” దశాబ్దాల చరితగల సింగరేణి కీర్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చీకటిమయం చేస్తోంది. ఒక్కోగనిని వేలం వేస్తూ ప్రయివేటీకరణకు వంత పాడుతోంది. ఈ నేపథ్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రకు సీపీఐ(ఎం) జులై 29న బెల్లంపల్లి నుంచి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కోల్‌బెల్ట్‌ ప్రాంతాల మీదుగా సాగుతున్న ఈ బస్సు యాత్ర బొగ్గు గనుల పుట్టినిల్లయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సింగరేణిని కేంద్రం ఎలా బలిపెడుతుందో.. లక్షలాది కార్మిక కుటుంబాలను ఎలా మసిచేయనుందో.. వివరిస్తూ ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సింగరేణిది శతాబ్దానికి పైబడిన చరిత్ర. 1774లో పశ్చిమబెంగాల్‌లో దామోదర నది పశ్చిమ ఒడ్డున రాణిగంజ్‌ కోల్‌ఫీల్డ్‌లో ఈస్టిండియా కంపెనీ బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. 1871లో ఇల్లెందు- సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రభుత్వరంగ కంపెనీగా రిజిస్టర్‌ అయింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నియంత్రణలో ప్రభుత్వ కంపెనీగా మారింది. 1971 వరకు భారతదేశంలో బొగ్గు గనులు ప్రయివేటు వారి చేతుల్లోనే ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నైజాం కాలం నుంచి సింగరేణి ఆధీనంలోనే ఉన్నాయి. దీనిలో నూరేండ్లకు పైబడిన కార్మిక పోరాటాలు ఓ విడదీయలేని భాగం. ఏడు లక్షలకు పైగా ఉన్న కోల్‌ ఇండియా కార్మికవర్గానికి ఉద్యమాలు కొత్తకాదు. కార్మిక హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలు అన్నీఇన్నీ కాదు. సింగరేణిని కాపాడుకునేందుకు ఎన్నో ఉద్యమాలు.. ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక లోకానిది. రూపానికి నల్లగా ఉన్నా లోకానికి వెలుగులనిచ్చే బొగ్గు గనుల కోసం ఎందరో అమరులైన విషయం మనకు తెలిసిందే. కానీ నేటి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేలం పాటల ద్వారా గనులను ప్రయివేటీకరిస్తూ సింగరేణి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాలనే కుట్ర చేస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక ఒకనాడు లక్షకు పైగా ఉన్న కార్మికులు నేడు 45వేలకు తగ్గారు. 50కి మించి ఉన్న భూగర్భ గనులు 20కి పడిపోయాయి. మరోవైపు నాలుగు ఉన్న ఓపెన్‌ కాస్టులను 20కి పైగా పెంచుతూ ప్రయివేటీకరణను కేంద్రం వేగవంతం చేస్తోంది.
వేలం పేరుతో కబళించే యత్నం..
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 60 బొగ్గు గనులకు వేలం ప్రక్రియను చేపట్టింది. పదో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా శ్రావణపల్లి గనిపై గురిపెట్టింది. ఇప్పటికే సత్తుపల్లి-3, కోయగూడెం గనులను ప్రయివేటుకు అప్పగించింది. వీటితో పాటు దేశంలోని ఒడిశాలో 16, మధ్యప్రదేశ్‌లో 15, ఛత్తీస్‌గఢ్‌లో 15, జార్ఖండ్‌లో 6, బీహార్‌లో 3, బెంగాల్‌లో 3, మహారాష్ట్ర, తెలంగాణలోని ఒక్కో గనిని మోడీ ప్రభుత్వం వేలం వేస్తోంది. ఇప్పటివరకు 107 కోల్‌బ్లాక్‌లను వేలం వేశారు. ప్రభుత్వరంగంలో 130 ఏండ్లుగా ఏటా రూ.6లక్షల కోట్ల వార్షికాదాయంతో లాభాల బాటలో పయనిస్తున్న మన సింగరేణి చరిత్రను కూడా ఈ గనుల వేలంతో కేంద్రం కాలగర్భంలో కలపాలని చూస్తోంది.
సింగరేణి ప్రయివేటీకరణకు బీజం..
తెలంగాణ ప్రాంతంలో నైజాం కాలం నుంచి బొగ్గు నిక్షేపాలపై లీజింగ్‌ అనుమతి సింగరేణికే ఉంది. కానీ మైనింగ్‌ అనుమతి మాత్రం ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి తీసుకుంటోంది. 1992-93 నుంచి బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిని తమ ప్లానింగ్‌లో లేని బ్లాకుల వివరాలను అడిగింది. ఆ మేరకు సింగరేణి కేంద్రానికి వివరాలు ఇచ్చింది. తాను ఇచ్చిన బ్లాకులు తప్ప మిగతావన్నీ తమవే అనుకున్నది కానీ తన పేరుతో మాత్రం పెట్టుకోలేదు. కోల్‌ ఇండియా మాత్రం తన ప్లానింగ్‌లో లేని బ్లాక్‌ల వివరాలు ఇచ్చి మిగతావాటిని తన పేరుతో పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎంఎండీఆర్‌ యాక్ట్‌ సవరణ జరుగుతున్నప్పుడు కోల్‌ ఇండియా బ్లాక్‌లను కోల్‌ ఇండియాకు ఇచ్చి, సింగరేణికి మాత్రం అప్పటివరకు అనుమతి ఉన్న మైనింగ్‌ బ్లాక్‌లనే కేటాయించారు. మిగతా బ్లాక్‌లన్నింటినీ బొగ్గు మంత్రిత్వశాఖ తన దగ్గర పెట్టుకుంది. నాటి నుంచి సింగరేణి అనేక పర్యాయాలు గనుల కోసం దరఖాస్తు చేసుకున్నా ఆ మైన్స్‌ను వేలంలో కొనుక్కోవాలని కేంద్రం సూచిస్తోంది. ఫలితంగా సింగరేణికి కొత్త బావుల అనుమతి రావడం లేదు. సింగరేణికి కొత్త అనుమతులు రాకపోతే.. బ్లాక్‌లు కేటాయించకపోతే 2038 నాటికి మొత్తం 27 బావులు మూతబడి 12 గనులు మాత్రమే సింగరేణికి మిగులుతాయి. తద్వారా సంస్థ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది. తద్వారా వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలకు సరఫరా చేసే బొగ్గు ధరలు పెరుగుతాయి. ఇప్పటికే సింగరేణి బొగ్గు టన్ను ధర రూ.3,900- 8000 వరకు లభిస్తుంటే.. ప్రయివేటు బొగ్గును రూ.8,000-రూ.13వేలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉంది.
ప్రయివేటీకరణతో ప్రయో’జనాల’కూ ఆటంకం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ద్వారా రూ.49,667 కోట్లు వివిధ పన్నుల రూపంలో లభిస్తున్నాయి. రాష్ట్రానికి రూ.23వేల కోట్లు, కేంద్రానికి రూ.26వేల కోట్ల ఆదాయం అందుతోంది. ఎన్టీపీసీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్‌, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ పేరుతో రూ.3వేల కోట్లు, సీఎస్‌ఆర్‌ పేరుతో రూ.300 కోట్లు, సింగరేణి వినియోగించే ఇంధనం ట్యాక్స్‌ల ద్వారా నెలకు రూ.కోటి, హరితహారానికి రూ.4.60 కోట్లు, కోవిడ్‌ సందర్భంలో రూ.100 కోట్లు, రామగుండం మెడికల్‌ కాలేజీకి రూ.500 కోట్లు, భద్రాద్రి కరకట్టకు రూ.100 కోట్లు, సివిల్స్‌ రాసే అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ అభయహస్తం పేరుతో ఒక్కొక్కరికి రూ.లక్ష ఇలా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యాలను సింగరేణి నిర్వహిస్తోంది. ప్రయివేటీకరణతో ఈ ప్రజా ప్రయోజనాలకూ ఆటంకం కలుగుతుందని నేతలు హెచ్చరిస్తున్నారు.
నేటితో ముగియనున్న పరిరక్షణ యాత్ర
ఈనేపథ్యంలో సింగరేణి పరిరక్షణకు జులై 29న బెల్లంపల్లి కోల్‌బెల్ట్‌ నుంచి ప్రారంభమైన సీపీఐ(ఎం) యాత్ర సోమవారం కొత్తగూడెంతో ముగియనున్నది. ఖమ్మం జిల్లా పెనుబల్లి నుంచి సత్తుపల్లి వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం కొత్తగూడెంలో ముగింపు సభ జరుగుతుంది. ఈ యాత్రకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌ హాజరుకానున్నారు. తాత్కాలికంగా యాత్ర ముగిసినా భవిష్యత్తు పోరాటాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఆ పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది.

Spread the love