నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్థికశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా భట్టి విక్రమార్కకు ఆర్థికశాఖ కేటాయించారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ రెండో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. అందుకు సంబంధించిన అంశాలపై కూడా భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు.