జల్ – జంగిల్ – జమీన్ హమారా హై
ఇస్ వతన్ పర్ హక్ హమారా హై
ఛోడ్‌దో హమే; యహాం సత్తాభీ హమారా హౌగా…
…అంటూ తను పుట్టి పెరిగిన ప్రాంతంలో గిరిజనులపై జరుగుతున్న దాడులు, భూకబ్జాలు, అక్రమ సుంకాలు, పెత్తందారీ తనం… వంటి అరాచకాల నుండి విముక్తి కోసం పోరాడుతూ ఈ నీళ్ళు మావి, ఈ అడవి మాది, ఈ భూమి మాది. ఇక్కడ మీ పెత్తనం నడవదు. మీ దొరతనం మాకొద్దు.
మా రాజ్యాన్ని మేమే నిర్మించుకుంటాం, మా ప్రాంతాన్ని మేమే పాలించుకుంటాం, మా అభివృద్ధి మేమే సాదించుకుంటాం… అని ఎదురు తిరిగి నిజాం ఖానూన్లను తిప్పికొట్టిన గెరిల్లా ఉద్యమ నేత. దొడ్డి దారిలో వచ్చిన నిజాం సైన్యాల తూటాలకు బలై అమరుడైన మహా యోధ. నిజాం గుండెల్లో నిప్పు రగిలించిన ‘భీం’ కొమరం భీం.
అది 1928 – 1940 మధ్యకాలం. అదే సమయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉప్పెనై ఎగసి పడుతోంది. హైదరాబాద్ సంస్థానంగా రాజ్యమేలుతున్న ఏడవ అసఫ్‌జాహి అధికార ప్రాంతంలో వ్యవసాయ సాధికారతలో రైతులపై, రైతు కూలీలపై, సామాన్య ప్రజలపై విధించిన ఆంక్షలు కాకుండా మాతృభాషపరమైన ఆంక్షలు కేవలం కూలీలనే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్న మధ్యతరగతి ప్రజలను, ప్రముఖులను ఉద్రేకపరచాయి. మరోవైపు ఉధృతంగా నడుస్తున్న దేశ నలుమూలల స్వతంత్య్ర పోరాట సమరం.
తెలంగాణలో నిజాం నిరంకుశులతోపాటు తెల్లోళ్ల సైన్యమూ కలిసింది. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా జోడేఘాట్ అటవీ ప్రాంతం. పుష్కలమైన సున్నపురాయి. కలప. పచ్చటి కొండల నుండి పారుతున్న సెలయేర్ల మధ్య సమృద్దికరమైన పంట పొలాలు, పండ్లు ఫలాలు. అటవీజంతువులు, పశుపక్షాదుల కోలాహలం మధ్య గిరిజనుల అనాగరిక జీవితాలు. అక్రమదారుల కళ్ళు కానలేక పోయాయి. గిరిజనులపై జరుగుతున్న దాడులు, భూకబ్జాలు, అక్రమ సుంకాలు, పెత్తందారీ తనం… వంటి అరాచకాలు మితిమీరి పోయాయి. భీం చూస్తుండగానే స్వగ్రామమైన సంకేపల్లి పరిసర ప్రాంతంలో కట్టెలు కొట్టాడనే నెపంతో తన తండ్రిని అటవీ అధికారులు చితక బాదారు. 17సంవత్సరాల వయస్సులో నూనూగు మీసాల భీం కళ్ళు కోపంతో ఎర్రబారాయి. ఒళ్ళంతా నివురుకింది నిప్పులా మసలిపోయింది. అటవీ అధికారుల దెబ్బలకి తండ్రి చిన్నూ స్వాస ఆగిపోయింది… కళ్ళెదుటే తండ్రి హాహాకారాలు వింటున్నా ఏమీ చేయలేని నిస్సహాయిస్థితి ఆ యువకుడిది.
భీం అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ తాలూక, సంకేపల్లి గ్రామవాసులైన కొమరం చిన్నూ – సోంబాయి దంపతులకు 1901 అక్టోబరు 22న జన్మించాడు. పట్టుదలకు, పరాక్రమానికి, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా చెప్పుకొనే ఆదివాసీలైన గోండులు వారు. నాడు తాలూకగా ఉన్న ఆసిఫాబాద్ నేడు జిల్లా ఏర్పడి కుమరంభీం పేరుతో అవతరించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.
1920అక్టోబర్‌లో తండ్రి మరణంతో భీం కుటుంబం కెరమెరి మండలంలోని సుర్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళింది. అక్కడ తన అన్న సాగుచేసుకుంటున్న భూములను సిద్ధికీ అనే జమీన్‌దార్ ఆక్రమించుకున్నాడు. అంతే; తండ్రి మరణం నుండి తన మనసులో రగిలి పోతున్న ఆక్రోశం కట్టలు తెంచి జమీన్‌దార్ సిద్ధికి మరణానికి కారకుడయ్యాడు. దాంతో పోలీసులకు పట్టుబడకుండా తప్పించు కోవడానికి, అతను కొండల్ అనే తన స్నేహితుడితో కలిసి కాలినడకతో మహారాష్ట్రలోని చాందా (చంద్రాపూర్) నగరానికి పారిపోయాడు. బ్రిటిష్ పాలకుల ఆగడాలకు వ్యతిరేకంగా నడిచే పత్రిక కోసం ప్రాంతీయ రైల్వేలలో ప్రింటింగ్ ప్రెస్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న స్థానిక ప్రచురణకర్త విటోబా అనే జర్నలిస్టు పరిచయం అయ్యాడు. జరిగిన సంఘటన తెలుసుకుని ఆ ఇద్దరికి విటోబా ఆశ్రయం కల్పించారు. భీమ్ విటోబాతో పని చేస్తున్న సమయంలో ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ మాట్లాడటం, చదవడం నేర్చుకున్నాడు.
ఆ తరువాత విటోబా ఆంగ్లేయుల పోలీసులకు పట్టుబడి అరెస్టుగావించబడ్డాడు. భీమ్ మళ్లీ పారిపోవాల్సి వచ్చింది. మంచిర్యాల్ రైల్వేస్టేషన్‌లో వలస కూలీతో పరిచయం పెంచుకుని అప్పటికప్పుడు భీం అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో పని చేస్తూనే కార్మిక సంఘాల కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఒక తోట యజమాని కూలీలకు డబ్బులు ఇవ్వడానికి బదులు అడిగిన వారిని కొట్టేవాడు. ఒకసారి ఆ సంఘటన కొమరం భీం కంట పడింది. దాంతో భీం ఆ తోట యజమానిని చితకబాదాడు. అతను పోలీసులకు పట్టించాడు. భీమ్ నాలుగు రోజుల్లో జైలు నుండి తప్పించుకుని, గూడ్స్ రైలు ఎక్కి తిరిగి తన స్వంత గ్రామానికి వచ్చాడు. భీమ్ తన చిన్నతనంలో రామ్‌జీ గోండ్ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి విన్నాడు. కాబట్టి ఆదివాసీల హక్కుల కోసం తన స్వంత పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించు కున్నాడు. పరాయీ పాలకులకు వ్యతిరేకంగా పని చేసే ఒక భూస్వామి అయిన లచ్చు పటేల్ వద్ద పని చేయడం ప్రారంభించాడు. అస్సాంలో తన అనుభవాన్ని ఉపయోగించుకుని, ఆసిఫాబాద్ ఎస్టేట్‌కు వ్యతిరేకంగా భూమి వ్యాజ్యం చేయడంలో అతను లచ్చు పటేల్‌కు సహాయం చేసాడు. ఇది అతనికి సమీప గ్రామాలలో బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ ప్రాంతంలో గోండు గిరజనులకు చెందిన 12 గూడేలు (గ్రామాలు). ఒకవైపు నిజాం మరోవైపు తెల్లదొరల అనుచరులు కుమ్మక్కై ఆ గ్రామాల సరిహద్దుల్లో అటవీ సంపదపై కన్నేసి ఆ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఆ అరాచకాన్ని సహించని కొమరంభీం అక్కడి ప్రజలను ఐక్యం చేసి ఆక్రమితులకు తిరగబడ్డాడు. చాలా గ్రామాలలో నిజాం పాలనకు సమాంతరంగా గోండుల పరిపాలన సాగింది. ఆ సమయంలో భీం సర్దార్‌పూర్ గ్రామంలో ఉన్నట్టు ఆచూకీ తెలుసుకున్నారు. 1940 అక్టోబరు 27 న అర్థరాత్రి జోడేఘాట్ గుహలలో నిద్రిస్తున్న కొమరంభీమ్ ను కుర్ధూపటేల్ సహాయంతో చుట్టుముట్టింది సైన్యం. అయినా జంకకుండా వారితో తలబడ్డాడు భీం. చివరికి వారిచేతిలో హతమయ్యాడు. కానీ చరిత్రలో ఒక గొప్ప పోరాటయోధుడిగా నిలిసిపోయాడు.
– మహేష్ దుర్గే, 8333987858