కోదండరాంను కలిసిన భీంరావ్‌ బాడా బాధితులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
భీంరావ్‌ బాడా బాధితులు బుధవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ను కలిశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా భీంరావ్‌ బాడా బాధితుల లీడర్‌ కొమరయ్య మాట్లాడుతూ 15 ఏండ్ల క్రితం తమ ఇండ్లను కూల్చేసిన పాలకులు ప్రత్యామ్నాయంగా సీతారాంబాగ్‌ లో జేఎన్‌ఎన్‌ యుఆర్‌ఎం ఇండ్లను కేటాయించారని తెలిపారు. అయితే అక్కడ మౌలిక వసతుల్లేక తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమకు భీంరావ్‌ బాడా స్థలంలోనే సొంత ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన తర్వాత సమస్య పరిష్కారవుతుందన్న ఆశతో అప్పటి మాజీ మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డితో పాటు హరీశ్‌ రావును కలిసి వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ తమకు అన్యాయమే జరిగిందన్నారు. ప్రస్తుతం భీంరావ్‌ బాడా స్థల వివాదం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, సీఎం రేవంత్‌ రెడ్డి నేతత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నామని తెలిపారు. కోదండరాం మాట్లాడుతూ భీంరావ్‌ బాడా విషయం తనకు తెలుసని, వీలైనంత త్వరగా బాధితులను సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి, సమస్యకు పరిష్కారాన్ని చేకూరుస్తానని హామీ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు.

Spread the love