– మైనారిటీలను దురాక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నారు
– కుషినగర్ మత ఘర్షణలపై స్థానిక ముస్లింల ఆరోపణలు
లక్నో: యూపీలోని కుషినగర్‌లో ఇటీవల చోటు చేసుకున్న మత ఘర్షణలపై అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల స్థానికు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. పోలీసులు ఒకవై పు మాత్రమే ఉంటున్నారని అన్నారు. మెజారిటీ వర్గం ప్రజల పట్ల పక్షపాతాన్ని చూపిస్తూ, మైనారిటీ వర్గం వారిని దురాక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నారని వెల్లడించారు. ” యూపీ పోలీసులు దర్యాప్తు పేరుతో సెలెక్టివ్‌గా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నా సోదరుడు సైఫ్ ఇంటికి వస్తున్న సమయంలో కసియా బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మిలాద్ ఊరేగింపును చూడటానికి వెళ్లి అతను ఇంటికి వస్తున్నాడు. హింసతో ఆయనకు సంబంధం లేదు. అయినప్పటికీ, పోలీసులు ఆయనను అరెస్టు చేశారు” అని సైఫ్ సోదరుడు సన్నీ ఖాన్ తెలిపాడు. గతనెల 28న ఈద్ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కుషినగర్‌లోని కసియాలో మెజారిటీ వర్గం ప్రజలుండే గోల బజార్ నుంచి వెళ్తున్న సందర్భంగా రెండు వర్గాల మధ్య ఈ మత ఘర్షణ చోటు చేసుకున్నది. అయితే, హింసలో రాళ్లదాడి ఆరోపణలపై అరెస్టయిన 31 మంది ముస్లింలే కావటం గమనార్హం. వీరిలో 15 మంది మైనర్లు ఉన్నారు. అయితే, వీరందరి పైనా పోలీసులు ఐపీసీలోని పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ” ఇది ఇబ్బందులకు గురి చేయటమేనని స్పష్టమవుతున్నది. మేమంతా శాంతియుతంగా, సామరస్యంగా ఉన్నాం. కానీ, ఒక వర్గం పైనే చర్యలు తీసుకున్నారు. ఈ అల్లర్లకు సమాన బాధ్యత వహించాల్సిన ఇతర వర్గం ప్రజలను మాత్రం విడిచిపెట్టారు” అని సబీర్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.