నవతెలంగాణ- వాషింగ్టన్: జి 20 సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుకాకపోవడం నిరాశకు గురిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఈ వారం భారత్ పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. ఆదివారం మీడియాతో బైడెన్ మాట్లాడుతూ.. భారత్‌లో జి20 సమావేశానికి జిన్‌పింగ్ రావడం లేదనే వార్త నిరాశకు గురిచేసిందని, కానీ జిన్‌పింగ్‌ను తాను చూడబోతున్నానని అన్నారు. తన భారత్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. భారత్, వియత్నాం రెండూ కూడా అమెరికాతో సన్నిహిత సంబధాలను కోరుకుంటున్నాయని, అది తమకు కూడా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ జి20 సదస్సుకు రెండు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 7న భారత్‌కు రానున్నారు. ఈ నెల 8న ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9,10 తేదీల్లో జి20 సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం వియత్నాం వెళ్లనున్నారు.