యూట్యూబ్‌పై పెత్తనమా ?

Big on YouTube?– అది ప్రజల గొంతుక
– సెన్సార్‌షిప్‌ మంచిది కాదు
– స్వీయ నియంత్రణే మేలు
– ప్రసార సేవల బిల్లుపై మీడియా ప్రముఖుల ఆందోళన
– కొందరికే ముసాయిదా పంపడం ఏమిటని నిలదీత
ప్రసార రంగానికి ఏకీకృత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావటం కోసం ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసెస్‌ (నియంత్రణ) బిల్లు, 2023 ముసాయిదాను విడుదల చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన బిల్లు కొత్త ముసాయిదా.. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో స్వతంత్ర వార్తల సృష్టికర్తల(న్యూస్‌ క్రియేటర్స్‌)ను నియంత్రించేలా తీసుకురాడిందనీ, ఈ ముసాయిదాపై కేంద్రం కావాలనే లీకులు ఇస్తున్నదని మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: ‘మీరు చెప్పేది ఇష్టం లేక ప్రభుత్వం మీ సంస్థను మూసేస్తుందేమోనని నిరంతరం భయపడుతుంటే అది భయానక వాతావరణాన్ని సృష్టించడమే అవుతుంది’ అని ఎన్డీటీవీ మాజీ సంపాదకుడు రవిష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు కారణంగా ఎదురయ్యే సవాళ్లు, ప్రభావాలపై డిజిపబ్‌ న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రసార బిల్లు రెండో ముసాయిదాను కొందరు ఎంపిక చేసిన మీడియా సంస్థలకు గత నెలలో విడుదల చేశారు. ధృవ్‌ రథి, రవిష్‌ కుమార్‌ వంటి డిజిటల్‌ కంటెంట్‌ రూపకర్తలను డిజిటల్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్లుగా ఈ ముసాయిదా బిల్లు పరిగణిస్తోంది. తద్వారా వివిధ వేదికలు, మాధ్యమాలకు చెందిన డిజిటల్‌ రూపకర్తల కోసం నూతన నిబంధనలు, నియమాలను నిర్దేశిస్తోంది. ఈ బిల్లుతో సంబంధమున్న కీలక భాగస్వాములకు దాని ముసాయిదాను అందజేయకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాత్రికేయుల సమావేశంలో రవిష్‌ కుమార్‌తో పాటు పాల్గొన్న ‘క్వింట్‌’ సహ-వ్యవస్థాపకురాలు, దిజిపబ్‌ ప్రధాన కార్యదర్శి రితూ కపూర్‌, ‘ది కారవాన్‌’ సంపాదకుడు, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ నాథ్‌, ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ సహ-వ్యవస్థాపకుడు, న్యాయవాది అపర్‌ గుప్తా కూడా బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సంప్రదించేందుకు డిజిపబ్‌ ప్రయత్నిస్తోందని, అయితే ఎన్ని లేఖలు రాసినా సమాధానం లేదని రితూ కపూర్‌ చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలలో ఐటీ నిబంధనలు, డాటా రక్షణ చట్టం, టెలికం బిల్లు, నూతన ప్రెస్‌ చట్టం, నూతన క్రిమినల్‌ చట్టాలు వంటి విధానాలు, చట్టాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రసార బిల్లును పరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని అనంత్‌ నాథ్‌ తలిపారు. సమాచారాన్ని నియంత్రించేందుకు, అందులో మార్పులు చేసేందుకు తీసుకొస్తున్న వ్యవస్థలో ప్రసార బిల్లు కేవలం ఒక భాగం మాత్రమేనని అన్నారు. ‘ఇప్పటికే ఐదు వేర్వేరు చట్టాలు, చర్యల ద్వారా సమాచారాన్ని నియంత్రిస్తున్నారు. ఇదెలా ఉందంటే ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నాయకుడిని జైలులో పెట్టారనుకోండి. సీబీఐ కేసులో ఆయనకు బెయిల్‌ వచ్చినా ఐటీ, ఈడీ కేసులు ఉంటాయి కదా..! అచ్చం అలాగే వుంది.’ అని వ్యాఖ్యానించారు. నియంత్రణ విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానికి వదిలేయకూడదని అన్నారు. ఏదైనా నియంత్రణ అవసరమైతే అది స్వీయ నియంత్రణే అయి ఉండాలని, దానికి మించి ఇతర నియంత్రణ వ్యవస్థలు ఉండకూడదని చెప్పారు.
ముసాయిదా బిల్లును కేవలం కొందరికి మాత్రమే పంపడంపై వక్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును ఎవరెవరికి పంపారో సాధ్యమైనంత త్వరగా బహిర్గతం చేయాలని, ముసాయిదా బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచాలని రవిష్‌ కుమార్‌ కోరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిపిన సర్వేలు, వచ్చిన వ్యాఖ్యలు డిజిటల్‌ జర్నలిస్టుల సత్తా ఏపాటిదో, వారి ప్రభావం ఎంతో నిరూపించాయని రితూ కపూర్‌ గుర్తు చేశారు. ఎన్నికల తరుణంలోనే ముసాయిదాను తీసుకొచ్చారన్న వాస్తవాన్ని విస్మరించకూడదని చెప్పారు. తమ ఆందోళన కేవలం బిల్లుపై మాత్రమే కాదని, దానిని తీసుకొచ్చిన తీరుపై కూడా అని తెలిపారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా మీడియా సంస్థలు, యూట్యూబ్‌ ఛాన ల్స్‌పై దాడులు జరుగుతున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ బిల్లు సెన్సార్‌షిప్‌కు దారితీస్తుందేమోనన్నదే మా ఆందోళన’ అని ఆమె అన్నారు. గ్రామాల్లో సైతం యూట్యూబ్‌ ద్వారా లక్షలాది మంది క్రియేటర్లు కార్యక్రమాలు రూపొందిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారని, లఢక్‌ నుండి కన్యాకుమారి వరకూ ప్రతి యూట్యూబర్‌పై ఈ బిల్లు దాడి చేస్తుందని రవిష్‌ కుమార్‌ చెప్పారు. ‘సమాచారాన్ని మదింపు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవడం ప్రతి యూట్యూబర్‌కు ఎలా సాధ్యం? అలాగే ఫిర్యాదుల కోసం అధికారిని ఎలా నియమించుకోగలరు? మా వంటి వ్యక్తులకు యూట్యూబే వేదిక. ప్రధాన స్రవంతి మీడియా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మా నోరు మూసే మార్గం కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. అయితే వారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. యూట్యూబ్‌ ద్వారా మేమే దాని నోరు మూయించగలం. మీడియా వార్తలపై వారు దృష్టి కేంద్రీకరించి, పరిశీలించి ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. బడా మీడియా సంస్థలు ఈ బిల్లుపై ఎందుకు నోరు మెదపడం లేదు? తమ భావ ప్రకటనా స్వేచ్ఛపై వారికి ఆందోళన లేదా?’ అని ప్రశ్నించారు. లక్షలాది మంది యువత ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వార్తలను కోరుకుంటున్నారని, అందుకే వారు డిజిటల్‌ రూపకల్పన వైపు మళ్లి యూట్యూబ్‌ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారని రవిష్‌ కుమార్‌ తెలిపారు. యూట్యూబ్‌ నుండే వాస్తవ సమాచారాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తమను నియంత్రించాలని అనుకుంటోందని, ఇబ్బందుల కారణంగా గోడీ మీడియా వెబ్‌సైట్ల నుండి వైదొలిగిన లక్షలాది మందిని తిరిగి వాటిలోకి పంపుతున్నారని ఆయన అన్నారు.

Spread the love