బీజేపీకి భారీ షాక్‌

బీజేపీకి భారీ షాక్‌– ప్రగల్భాలు పలికిన మోడీకి భంగపాటు
– ఈసీ సక్రమంగా ఉన్నట్టయితే ఎన్డీఏకు మరింత ప్రతికూలమే : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. గత రెండు ఎన్నికల్లోనూ లోక్‌సభలో వచ్చిన మెజారిటీ ఈసారి తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని పదే పదే ప్రగల్బాలు పలికిన నరేంద్ర మోడీ చుట్టూ నిర్మించిన అజేయత ప్రతిష్టకు ఇది పెద్ద ఎదురు దెబ్బ అని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
ప్రతిపక్షాలపై దాడులు, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ధన బలాన్ని విచ్చలవిడిగా ఉపయోగించడం నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ నిరంకుశ దాడులకు దీటుగా ఎదురొడ్డి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణకు నిలబడిన ప్రజలకు పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియచేసింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ దుస్థితి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు వంటి అంశాలను చేపడుతూ ఇండియా బ్లాక్‌ విశ్వసనీయమైన రీతిలో ప్రచారం నిర్వహించింది. మోడీ, బీజేపీలు సాగిస్తున్న మతోన్మాద విషపూరిత ప్రచారాన్ని గణనీయంగా అడ్డుకోగలిగింది.
అందరికీ సమాన అవకాశాలు వుండేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకున్నట్లైతే ఈ ఫలితాలు బీజేపీకి, ఎన్డీఏకి మరింత ప్రతికూలంగా వుండేవని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నరేంద్ర మోడీ రెచ్చగొట్టే రీతిలో సాగించిన మతోన్మాద, విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడంలో, ఎన్నికల నిబంధనావళిని కచ్చితంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమవడం ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టకు మాయని మచ్చ వంటిదని సీపీఐ(ఎం) పేర్కొంది.
సీపీఐ(ఎం), వామపక్షాలు ఈ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరింత వివరణతో కూడిన విశ్లేషణ వుంటుందని తెలిపింది.ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల జీవనోపాధులపై జరిగే దాడులన్నింటినీ ప్రజలు తిప్పికొడుతున్నారని ఈ తీర్పు సంకేతాలిస్తోంది.

Spread the love