కాంగ్రెస్ పార్టీకి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో భారీ షాక్‌

– గులాబీ గూటికి తొర్రూరు మండ‌ల కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు
– హైద‌రాబాద్ లో మంత్రి ఎర్ర‌బెల్లి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిన జ‌క్కుల రాంరెడ్డి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ తొర్రూరు మండ‌ల శాఖ అధ్య‌క్షుడు జ‌క్కుల రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ గూటికి చేరాడు. హైద‌రాబాద్ లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గురువారం సాయంత్రం రాం రెడ్డికి గులాబీ కండువా క‌ప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, రామ్ రెడ్డి మాట్లాడుతూ, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేసుకుంటున్న హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆశ‌యాలు, ల‌క్ష్యాల‌కు భిన్నంగా ప‌ని చేస్తున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఉంటుందని చెబుతున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి కూడా తీర‌ని అన్యాయం చేస్తున్నారు. క‌ష్ట కాలంలో పార్టీని నిల‌బెడుతూ ఈ రోజు వ‌ర‌కు క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్న నాయ‌కుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. త‌న వెంట ఉన్న ఇద్ద‌రు ముగ్గురు తొత్తుల‌తో అవ‌మానాల పాలు చేస్తున్నారు. అమె త‌మ స్వార్థానికి ప‌ని చేస్తూ, మిగ‌తా వాళ్ళ‌ని బ‌లితీసుకుంటున్నారు. ఆమె వ్య‌వ‌హార శైలి ఆ పార్టీకి తీర‌ని న‌ష్టం చేసే విధంగా ఉంది. అందుకే తాను ఆమె నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తూ, ఆ పార్టీని వీడుతున్నాను. బిఆర్ ఎస్ పార్టీ విధి విధానాలు, రాష్ట్రంలో సీఎం కెసిఆర్‌, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు ప్ర‌జ‌ల అభివృద్ధి, సంక్షేమాల‌కు చేస్తున్న కృషికి ఆక‌ర్షితుడినై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిఆర్ ఎస్ పార్టీ విజ‌యానికి కృషి చేస్తాన‌ని ఆయ‌న అన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ లో చేరిన రామ్ రెడ్డిని సాద‌రంగా ఆహ్వానిస్తున్న‌ట్లు చెప్పారు. ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత గౌర‌వం క‌ల్పిస్తామ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప‌ని చేయాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు వాస్త‌వాల‌ను గ్ర‌హించాల‌ని, క‌నువిప్పుతో ప్ర‌వ‌ర్తించాల‌ని అభ్య‌ర్థించారు.
Spread the love