ఐపీఎల్ కి ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్

mohammed-shamiనవతెలంగాణ – హైదరాబాద్
ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్టు తెలుస్తోంది. మడమనొప్పి వేధిస్తుండడంతో సర్జరీ కోసం లండన్ వెళ్తున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. గతేడాది స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో షమీ గాయపడ్డాడు. అయినప్పటికీ పెయిన్ కిల్లర్స్ సాయంతో నెట్టుకొచ్చాడు. టోర్నీ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనతోపాటు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. గాయం ఇంకా సలుపుతూనే ఉండడంతో సర్జరీ కోసం ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు కూడా షమీ దూరమైనట్టేనని భావిస్తున్నారు. షమీ చివరిసారి ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు. గత నెల చివర్లో షమీ చీలమండ గాయానికి ఇంజక్షన్లు తీసుకునేందుకు లండన్ వెళ్లాడని, అవి తీసుకున్న మూడు వారాల తర్వాత తేలికగా పరిగెత్తడం ప్రారంభించవచ్చని వైద్యులు చెప్పినప్పటికీ అవి పనిచేయలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడతడి ముందున్న ఫైనల్ ఆప్షన్ సర్జరీ మాత్రమేనని, రేపోమాపో అతడు యూకే వెళ్తాడని పేర్కొన్నారు.

Spread the love