ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్ ట్వీస్ట్…

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్)మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు అమెరికా గ్రీన్‌కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా చాలా త్వరగా అది మంజూరయింది. ఈ పరిణామాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.
గ్రీన్‌కార్డు లభించడం ఫోన్‌ ట్యాపింగ్‌  కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశలేకపోలేదు. కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై దర్యాప్తు అధికారులు మథనం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పోలీసులు ఎల్ఓసి జారీచేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కలర్ నోటీస్ జారీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్‌ కార్డు లభించడంతో ఆయన ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది.
తాను వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లానని, ప్రస్తుతం ఇల్లినాయిస్‌ అరోరాలో ఉన్నట్టు,  తన వీసా గడువు జూన్‌తో ముగుస్తుందని… వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్‌ వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గడువు దాటినా ఆయన రాకపోవడంతో మరోసారి ఆరా తీస్తే గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రభాకర్‌రావుపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు గ్రీన్‌కార్డు వచ్చింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

Spread the love