మానవాళి రక్షణ కవచం… జీవ వైవిధ్యం!

మానవాళి రక్షణ కవచం... జీవ వైవిధ్యం!మన చుట్టూ ఎన్నో రకరకాలైన మొక్కలు, జంతువులు ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఒంటరిగా ఏఒక్క ప్రాణీ జీవించలేదు, జీవించదు కూడా. నివాసం, ఆహారం, ప్రత్యుత్పత్తి కోసం తన చుట్టూ ఉండే పరిసరాల మీద, ఇతర జీవరాశుల మీద ఆధారపడక తప్పదు. మనం ఏ రెండు మొక్కల్ని తీసుకున్నా లేదా ఏ రెండు జీవులను పరిశీలించినా అవి విభిన్న లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ విధంగా జీవ జాతుల మధ్య, పర్యావరణ సముదాయాల మధ్య నెలకొన్న వైవిధ్య భరిత లక్షణమే జీవ వైవిధ్యం. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా 1986లో వాల్టర్‌ రోసెన్‌ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. బ్రెజిల్‌ అత్యధిక జీవవైవిధ్యం కలిగిన దేశం. జీవ వైవిధ్యం మొక్కలు, బ్యాక్టీరియా, జంతువులు, మానవులతో సహా ప్రతి జీవిని సూచిస్తుంది. ఒకదానితో ఒకటి పునరుత్పత్తి చేయగల అన్ని జీవులు ఒకే జాతికి చెందుతాయి. ఈ భూమ్మీద సుమారుగా కోటి నుంచి 8కోట్ల జాతులు నివసిస్తున్నట్లుగా శాస్త్రవేత్తల అంచనా. వాటిలో కేవలం 15 లక్షల జాతులను మాత్రమే ఇంతవరకు గుర్తించారు. వీటిలో ఎక్కువ భాగం కీటకాలు. మిలియన్ల కొద్దీ ఇతర జీవులు పూర్తి రహస్యంగా మిగిలిపోయాయి.
జీవవైవిధ్యం అనేది జన్యు వైవిధ్యం, జాతుల వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం అనే మూడు రకాలుగా ఉంటుంది. మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, నైరుతి యునైటెడ్‌ స్టేట్స్‌ మరియు మడగాస్కర్‌ వంటి ప్రాంతాలు ఎక్కువ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి.జీవవైవిధ్యం లేకుండా పర్యావరణ వ్యవస్థ పనిచేయడంలో విఫలమవుతుంది. వఅక్షాలు, జంతువులు వాటి మనుగడ కోసం ఒకదానిపై ఇంకొకటి ఆధారపడుతున్నాయి. ఈ వైవిద్యం వలనే వృక్ష, జంతు వులతో పాటుగా మానవాళికి నివాసం ఆహారం, వస్త్రాలు, ఔషధాలు, మాంసకృత్తులు, ఎంజైంలు సమ కూరుతున్నాయి. వాతావరణ కాలుష్యం నుంచి మనకి రక్షణ కలుగుతుంది. జీవ సముదాయాలు వాతా వరణంలోని వివిధ వాయువులను క్రమపరచి శీతో ష్ణస్థితిలో పెనుమార్పులు రాకుండా కాపాడుతాయి. ఒక చెట్టు తన జీవిత కాలంలో సుమారు 25లక్షల గ్యాలన్ల నీటిని వాతావరణానికి చేరుస్తుంది. తడి భూములు నీటిలోని భార లోహాలు, ఇతర మలినాలను వడబోస్తాయి. అత్యధిక స్థాయిలో జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లు అంటారు. ప్రపంచవ్యాప్తంగా 36 జీవ వైవిధ్య హాట్‌ స్పాట్లున్నాయి. ఇక్కడ అనేక అంతరించి పోతున్న, హానికలిగించే జాతులతో పాటు ప్రపంచంలోని సగానికి పైగా వృక్ష జాతులు, క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు ఉభయచర జాతులు స్థానికంగా కలిగి ఉంటాయి. మనదేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఇండో-బర్మా ప్రాంతం, సుండాలాండ్‌ ప్రాంతం హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి.
1992లో రియో డి జునేరోలో జరిగిన భూసదస్సులో జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్యసమితి సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణకు బాధ్యత వహించే ఒప్పందం. 175 కంటే ఎక్కువ దేశాలు ఈ జీవవైవిధ్య ఒప్పందాన్ని ఆమోదించాయి. ఇందులో ఇండియా కూడా ఉంది. మనదేశంలో బయోలాజికల్‌ డైవర్సిటీ యాక్ట్‌ 2002 అమలులో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, బయోస్పియర్‌ రిజర్వ్‌లు, మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం ఉద్దేశించిన ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ చట్టాల ప్రకారం మొక్కలు నాటడం, సాగుచేయడం, మేత ఉన్నాయి. చెట్లను నరికివేయడం, వేటాడటం నిషేధించబడ్డాయి. కానీ ఇదంతా పేరుకు మాత్రమే అన్నట్టుగా ఉంది. కేంద్రం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం కార్పొరేట్లకు ప్రయోజనంగా మారింది. అటవీ సంపదను చాలావరకు స్వప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు. జంతువుల మాంసం కోసం, చర్మం కోసం, ఆహ్లాదం కోసం వేటాడుతున్నారు. కొంతమంది జంతువుల అవయవాలతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. యథేచ్ఛగా అడవులను నరుకుతున్నారు. వినియోగంతో పాటు పర్యావరణ వ్యవస్థలకు భంగం కలిగించడం, లేదా నాశనం చేసే ఇతర కార్యకలాపాల కారణంగా జీవవైవిధ్యం ప్రమాదంలో ఉందనేది వాస్తవం. కాలుష్యం, వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల అన్నీ జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించే కారకాలే.
కొంతమంది శాస్త్రవేత్తలు రాబోయే శతాబ్దంలో భూమిపై ఉన్న అన్ని జాతులలో సగం తుడిచి పెట్టుకు పోతాయని అంచనా వేస్తున్నారు. గత ఇరవై ఏండ్లలో దాదాపు 27 శాతం జాతులు అంతరించి పోయాయి. పక్షి జాతులలో 12 శాతం, క్షీరద జాతులలో 23 శాతం, ఉభయచర జాతులలో 32 శాతం, జిమ్నోస్పెర్మ్‌ జాతులలో 31 శాతం అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ఐయుసిఎన్‌ రెడ్‌ లిస్ట్‌ ఇండియా 2022 ప్రకారం 41వేల కంటే ఎక్కువ విభిన్న జాతుల జంతువులు, పక్షులు, ఇతర జీవులు ముప్పు అంచున ఉన్నాయి. కొన్ని అరుదైన వృక్షాలు, జంతువులు అంతరించిపోతున్నాయి. బెంగాల్‌ టైగర్‌, ఆసియా సింహం, క్రిష్ణ జింక, మంచు చిరుత, కాశ్మీర్‌ రెడ్‌ స్టాగ్‌, నీలగిరి తహర్‌, కొమ్ము ఖడ్గమృగం, లయన్‌ టెయిల్డ్‌ మకాక్‌, రెడ్‌ పాండా, ఇండియన్‌ బైసన్లు, లేత గులాబీ వర్ణం తల గల బాతు సంబంధ జాతి, కస్తూరి మృగము, కంకణ జాతి పక్షి, ఎరుపు వర్ణపు మగలేడి అంతరించిపోయే జాతులలో ఉన్నాయి. సుసంపన్నమైన జీవవైవిధ్యం పొందడానికి కారణమయ్యే పరిణామం సంభవించడానికి వేల సంవత్సరాలు పడుతుంది. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, అంతరించిపోతున్న జాతు లను, వాటి ఆవాసాలను రక్షించడానికి ప్రభుత్వ పరిరక్షణ ప్రయత్నాలు అవసరం. అలాగే జీవ వైవిధ్య రక్షణలో మన బాధ్యత కూడా ఉందన్న సంగతి మరవకూడదు.
(నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం)
– జనక మోహన రావు దుంగ,
సెల్‌ : 8247045230

Spread the love