– అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
– నేడు ప్రపంచ పులుల దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ద పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)ఫారెస్టుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. మేనేజ్‌మెంట్ ఎఫెక్టివ్‌నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) నివేదికలో టైగర్ రిజర్వుల నిర్వహణలో అమ్రాబాద్ 78.7 శాతం స్కోర్‌తో వెరీ గుడ్ కేటగిరీలో, కవ్వాల్ 74.2 శాతం స్కోర్‌తో గుడ్ కేటగిరీలో నిలిచాయని వివరించారు. వన్యప్రాణులు, మానవుల మధ్య సంఘర్షణ నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కవ్వాల్ కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కల్పించి రిలోకేట్ చేస్తున్నామని పేర్కొన్నారు.