బర్డ్‌ ఫ్లూ బందోమస్తు

Bird Flu Bandomastu– తెలంగాణ సరిహద్దుల్లో అప్రమత్తం
– రాష్ట్రంలో ఎక్కడా కనిపించని బర్డ్‌ఫ్లూ లక్షణాలు
– ముందు జాగ్రత్త చర్యగా పశుసంవర్ధక శాఖ అలర్ట్‌
– చేపల ఆహారంగా మారిన చికెన్‌ వ్యర్థాలతోనూ జాగ్రత్త
– ఉడికించిన మాంసంతో ప్రమాదం లేదంటున్న నిపుణులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్‌ ఇన్‌ఫ్ల్లూయెంజా (హెచ్‌ఎన్‌1 -బర్డ్‌ ఫ్లూ) వైరస్‌ కారణమని తేలింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ (ఐసీఏఆర్‌-ఎన్‌ఐ హెచ్‌ఎస్‌ఏడీ)కు పంపారు. అందులో పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. రాష్ట్రంలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ లక్షణాలు లేకపోయినా చికెన్‌ వినియోగం విషయంలో కొందరు సందేహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో చికెన్‌, గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏపీలో పెద్దఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి కోళ్లు, గుడ్లు తెలంగాణకు రవాణా కాకుండా అప్రమత్తమయ్యారు.
సరిహద్దులో చెక్‌ పోస్టులు
కోళ్లకు సోకుతున్న వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో 240 చెక్‌పోస్ట్‌లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లా బోనకల్‌, నేలకొండపల్లి, ముదిగొండ, ఎర్రుపాలెం, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు ఇలా పలు మండలాల్లోని ఏపీ రాష్ట్ర సరిహద్దులను అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మూడు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్‌ రోడ్‌లోని అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ వద్ద తనిఖీలు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా ప్రతి చెక్‌ పోస్టు వద్ద రోజుకు రెండు, మూడు లారీలైనా వెనక్కి పంపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కోళ్ల వ్యర్థాలు, కళేబరాలతో ప్రమాదమే..
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల కోడి మాంసం వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల చనిపోయిన కోళ్లను సైతం చేపల చెరువుల్లో వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం చెరువులో చనిపోయి, కుళ్లిపోయిన కోళ్లను రెండ్రోజుల కిందట వేయడం కలకలం సృష్టించింది. బర్డ్‌ ఫ్లూయే కాదు ఎటువంటి సమయంలోనూ చనిపోయిన పశుపక్ష్యాదులను పూడ్చాలే కానీ చేపల ఆహారంగా వేయొద్దని, చెరువులు, ఖాళీ ప్రదేశాల్లోనూ కళేబరాలను వదిలితే గాలిలో రకరకాల వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 కోళ్ల ఫారాలు ఉన్నాయి. అందులో ఒక్కో దానిలో 2000 నుంచి 20,000 వరకు కోళ్లు పెంచుతున్నారు. మొత్తంగా వాటిలో సుమారుగా 10 లక్షల వరకు ప్రస్తుతం కోళ్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 వరకు చిన్న, పెద్ద కలిపి చికెన్‌ షాపులు ఉన్నాయి. వీటిలో సాధారణ రోజుల్లో 50 టన్నుల చికెన్‌ అమ్మకాలు జరిగితే.. ఆదివారం మాత్రం వంద టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయి. బర్డ్‌ ఫ్లూ కేసులు ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడా బయటపడలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చా?
ఉడికించిన చికెన్‌, గుడ్డును తినొచ్చా? లేదా? అనే సందేహం కలుగుతోంది. ప్రజలు చికెన్‌, గుడ్డు తీసుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ బతకదని నిపుణులు చెబుతున్నారు. కోడిమాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తాం కాబట్టి అందులో ఎలాంటి వైరస్‌ ప్రభావం ఉండదని చెబుతున్నారు. 60 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ బతికే అవకాశమే లేదని, ఈ వైరస్‌ వ్యాప్తిపై భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చికెన్‌ చీకులు, ఎగ్‌ ఆమ్లెట్ల జోలికి వెళ్లకపోవటం మంచిదని చెప్తున్నారు. పచ్చి కోడిగుడ్లు తాగే అలవాటు ఉన్నవారు కొంతకాలం నిలిపివేయాలని సూచిస్తున్నారు.
సోషల్‌ మీడియా పుకార్లు నమ్మొద్దు : పారా సత్యనారాయణ, చికెన్‌ షాపుల యజమానుల సంఘం కార్యదర్శి, ఖమ్మం జిల్లా
బర్డ్‌ ఫ్లూ కన్నా సోషల్‌ మీడియా పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని నమ్మి చికెన్‌ వినియోగించక పోవటం సరికాదు. రాష్ట్రంలోనే ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా కోళ్లు చనిపోలేదు. వదంతులు నమ్మొద్దు. చికెన్‌ రేట్లు పడిపోవాలనే దురుద్దేశంతో కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
చెక్‌పోస్టుల్లో డాక్టర్ల చెకింగ్‌ : వి.అరుణ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పశుసంవర్థకశాఖ, ఖమ్మం జిల్లా
జిల్లా కలెక్టర్‌ ముజామ్మిల్‌ ఖాన్‌ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో చెక్‌ పోస్టులు ఉన్న ప్రాంతాల్లో డాక్టర్లను ఏర్పాటు చేశాం. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, గుడ్లు, బాతులు, బర్డ్స్‌ వాహనాలను పరీక్షిస్తున్నార. బర్డ్‌ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్‌లకు వెళ్లిన మనుషులు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు, దాణా, గాలి, ఎలుకలు, ఈగల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. బర్డ్‌ ఫ్లూ సోకిన వలస పక్షులు రెట్ట వేయడం ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందొచ్చు. ఏ మాంసమైనా 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో 30 నిమిషాల పాటు ఉడికిస్తే ఎలాంటి వైరస్‌ అయినా బతికే అవకాశం లేదు.

Spread the love