బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌.. రాష్ట్ర సరిహద్దులు అప్రమత్తం

Bird flu effect.. State borders are on alert– భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో పశుసంవర్ధక శాఖ తనిఖీలు
– ఇతర రాష్ట్రాల కోళ్లు రవాణాకు జిల్లాలోకి నిరాకరణ
– భారీగా పడిపోయిన చికెన్‌ విక్రయాలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, చర్ల సరిహద్దుల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిఘా పెంచారు. ఈ రెండు ప్రదేశాల్లో ఇటు అశ్వారావుపేట రవాణా శాఖ తనిఖీ కేంద్రం, అటు బస్తర్‌(ఛత్తీస్‌గఢ్‌) నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. ఆంధ్రాలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీల్లోని లక్షలాది కోళ్ళు మృత్యువాత పడటం, అనంతరం ల్యాబ్‌ టెస్టుల్లో కోళ్ళకు బర్డ్స్‌ ఫ్లూ పాజిటివ్‌, ”ఏవీఎన్‌ ఇన్ప్లూయే” వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అవడంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాల సరిహద్దులను కట్టుదిట్టం చేసింది. ఆంధ్రా నుంచి కోళ్లు తెలంగాణలోకి అనుమతించొద్దని ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అందులోభాగంగా అశ్వారావుపేట, చర్ల తనిఖీ కేంద్రం వద్ద పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆంధ్రా, బస్తర్‌ల నుంచి తెలంగాణలోకి రవాణా చేస్తున్న కోళ్ల వాహనాలను అడ్డుకుని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. వైరస్‌ పూర్తిగా నశించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అప్పటి వరకూ బ్రాయిలర్‌, లేయర్‌ కోళ్ల వాహనాలు సహా చిక్స్‌ వాహనాలు కూడా రాష్ట్రంలోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అశ్వారావుపేట ప్రాంతానికి పెద్ద బాయిలర్‌, ఫారం కోళ్లు ఆంధ్రాలోని తిరువూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం నుంచి రవాణా చేస్తారు. వీటిని పశుసంవర్ధక శాఖ అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. చిన్న బాయిలర్‌ కోళ్లను అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పౌల్ట్రీ ఫామ్‌లో కొనుగోలు చేస్తున్నారు. మండలంలో సుమారుగా 100 మాంసం దుకాణాలు ఉన్నట్టు యజమానులు తెలిపారు. ఆంధ్రాలో బర్డ్స్‌ ఫ్లూ సోకడంతో తెలంగాణ సరిహద్దు మండలాల్లో మాంసం విక్రయాలు పడిపోయాయని దుకాణం యజమానులు వాపోతున్నారు. ఈ విషయంపై పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తమ సిబ్బందితో నిఘా పెట్టామని తెలిపారు. స్థానిక ఎస్‌హెచ్‌ఓ ఎస్‌ఐ యయాతి రాజును వివరణ కోరగా.. తమ శాఖ నుంచి నిఘా పెంచామని కానీ, కోళ్ల లోడ్‌లు వెనక్కి పంపమని ఎటువంటి అధికారిక ఆదేశాలు లేవన్నారు.

Spread the love