బీరేన్‌సింగ్‌ రాజీనామా చేయాలి

– దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఘోర హింసాకాండను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన సిఎం ఎన్‌.బీరేన్‌సింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఐద్వా ఆధ్వర్యాన మహిళలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం, వివిధ ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి. బీరేన్‌సింగ్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టాయి. మహారాష్ట్రలోని మరోల్‌ తదితర ప్రాంతాల్లో సిపిఎం, ఐద్వా, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు.
ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పాలి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కెకె శైలజ
ఆడపిల్లలను వీధుల్లో ఊరేగించి సామూహిక అత్యాచారం చేసి చంపే దేశంగా భారతదేశం దిగజారిపోయిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కెకె శైలజ విమర్శించారు. మహిళలు, బాలికల గౌరవాన్ని కాపాడడంలో విఫలమైనందుకు ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అల్లర్లకు సహకరిస్తున్న మణిపూర్‌ ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నారు, మణిపూర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా తలస్సేరిలో మహిళా అసోసియేషన్‌ జిల్లా కమిటీ నిర్వహించిన నిరసన ర్యాలీని ఆమె ప్రారంభించారు. మణిపూర్‌ కాలిపోతుంటే మోడీ విదేశాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను ఆమె ఇంట్లోనే కాల్చివేసి, కార్గిల్‌ యుద్ధ సైనికుడి భార్యను వివస్త్రను చేశారని విమర్శించారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మహిళల, యువతుల గౌరవాన్ని కాపాడలేకపోయిందని అన్నారు. ఇంటర్నెట్‌ను నిలిపివేయడం ద్వారా మణిపూర్‌లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకూడదని మోడీ భావించారని చెప్పారు.

Spread the love