బిజెపితో పొత్తు… టిడిపితో కాపురం!

– చంద్రబాబుకు పదేళ్లుగా వలంటీర్‌ ‘దత్తపుత్రుడు’
– వెంకటగిరి బహిరంగ సభలో సిఎం జగన్‌
– ‘నేతన్న నేస్తం’ రూ.194 కోట్లు జమ
తిరుపతి : ‘నీతిమాలిన రాజకీయాలు చేసేవారు కూడా వలంటీర్‌ వ్యవస్థను విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు పదేళ్లుగా వలంటీర్‌గా దత్తపుత్రుడు పనిచేస్తున్నాడు. బిజెపితో పొత్తు పెట్టుకుని టిడిపితో కాపురం చేస్తున్నారు. వీరి జీవితమంతా వెన్నుపోట్లు, వంచన’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు చేరుకున్న సిఎం… ప్రత్యేక హెలికాప్టర్‌లో వెంకటగిరికి పది గంటలకు వచ్చారు. చేనేత కార్మికులతో కలిసి నేత నేశారు. చేనేత రంగంలో రాష్ట్రపతి అవార్డు పొందిన పది మందితో ఫొటోలు తీసుకున్నారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఐదో విడత వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం కింద 80,806 మందికి రూ.194 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ టిడిపి, జనసేన పార్టీలను ఎండగడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. బిసిలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా మార్చామన్నారు. నవరత్నాల పథకంలో భాగంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. 50 నెలల కాలంలో రూ.970 కోట్లు నేతన్న నేస్తం ద్వారా అందించామన్నారు. చంద్రబాబు పాలనలో చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. 77 నేతన్న కుటుంబాలకు చంద్రబాబు హయాంలో నష్టపరిహారం ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబానికీ రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో అందించామని తెలిపారు. 2014-19లో ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలన్నీ మూలన పడేశారని విమర్శించారు. క్యారెక్టర్‌ లేని వ్యక్తులు వలంటరీ వ్యవస్థపై మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కులం, మతం అని చూడకుండా పార్టీలకతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరించే మనవూరి పిల్లలపైన వలంటీర్లపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 2.65 లక్షల మంది వలంటీర్లలో 65 శాతం మంది తన చెల్లెమ్మలేనన్నారు. వెంకటగిరి టౌన్‌లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమరనాథ్‌, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపి మద్దిల గురుమూర్తి, ఎంఎల్‌ఎలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సంజీవయ్య, వరప్రసాద్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, వెంకటగిరి ఇన్‌ఛార్జి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love