– జమిలీతో నష్టపోయేది బీఆర్‌ఎస్, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలే
– ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులే
– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– యాదాద్రి భువనగిరి జిల్లా మహాసభల సందర్భంగా చౌటుప్పల్‌లో బహిరంగసభ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాల వల్ల పదేండ్లుగా రాజ్యాంగం విధ్వంసం అవుతున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. 75 ఏండ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఈ ప్రభుత్వాన్ని తప్పించడమే మార్గమని, అందుకు పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఆదివారం చౌటుప్పల్ పట్టణంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక వలిగొండ రోడ్డు నుంచి బహిరంగ సభ ప్రాంతం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అధ్యక్షతన జరిగిన సభలో రాఘవులు మాట్లాడారు. కుల, మత విశ్వాసాలను పెంచి పోషించి మరింత కాలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సనాతనధర్మాన్ని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చావు దప్పి కన్నులొట్టపోయిన చందంగా అధికారంలోకి వచ్చిన మోడీ తన వైఖరిని మార్చుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు, బీహార్‌లో నితీష్‌కుమార్ తమకు డబ్బులు వస్తే చాలు అనే విధంగా మోడీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయిన మోడీ.. అన్ని వర్గాలపై దాడులు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. బీజేపీ నల్లచట్టాలు, విద్యుత్ చట్టం తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు ఇస్తుంటే బీజేపీ మీటర్లు పెట్టమని ఒత్తిడి తెస్తున్నదని, పెట్టకపోతే.. రాష్ట్రాలకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నదని తెలిపారు. రైతుల హక్కులను కాలరాసే విధానాల్ని అమలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చౌటుప్పల్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న త్రిబుల్ ఆర్ నిర్మాణంలో రైతులకు అన్యాయం చేస్తూ 40 కిలోమీటర్ల దూరంలో వేయాల్సిన రహదారులను 28 కిలోమీటర్ల దూరంలోనే నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోట్ల విలువ చేసే భూములను రూ.పది లక్షలకు, 20 లక్షలకు తీసుకొని నష్టం చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రైతులు ముఖ్యమా, పరిశ్రమల యజమానులు ముఖ్యమా సమాధానం చెప్పాలన్నారు. భువనగిరి జిల్లా శివారులో అనేక పరిశ్రమలు ఉన్నాయని, ఈ పరిశ్రమలు వ్యర్థ పదార్థాలు వెదజల్లుతూ ప్రజల ప్రాణానికి హాని కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివిస్ అదానీ కంపెనీలు డబ్బులు పోగు చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ప్రజల అవసరాల కోసం కాదన్నారు. సామాజిక న్యాయం కోసం, దోపిడికి వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టులు బలపడాలని, అప్పుడే సోషలిజం బలపడుతుందని స్పష్టంచేశారు. ఎర్రజెండా బలపడకుండా మన సమస్యలు పరిష్కారం కావన్నారు. బీజేపీ ప్రభుత్వం ”ఒకే దేశం, ఒకే మతం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక” అంటూ ప్రచారం చేసుకుంటూ జమిలి ఎన్నికలనే ప్రస్తావన ప్రస్తుతం పార్లమెంట్‌లో జరుగుతుందన్నారు. ఈ జమిలి ఎన్నికల ద్వారా నిరంకుశత్వం వస్తుందని, దీన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తుందన్నారు. నష్టపోయేది ప్రాంతీయ పార్టీలేనని, ముఖ్యంగా ఆంధ్రా, తెలంగాణలో టీడీపీ, బీఆర్‌ఎస్ పార్టీలేనన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా కేసీఆర్, చంద్రబాబు నాయుడు మాత్రం వ్యతిరేకించడం లేదని చెప్పారు. ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం వెనుక ధన బలాన్ని ప్రదర్శించడం కోసమేనని అన్నారు. దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలు జరిగితే సమయం, డబ్బు ఆదావుతుందని ప్రచారం చేస్తున్నారని, అలాంటిది ఏమీ జరగదన్నారు. ప్రస్తుతం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఆరు దశలుగా జరుగుతున్నాయని, వీటికోసం ఒక ఈవీఎం పెడితే సరిపోతుందని, అదే ఒకేసారి జమిలి ఎన్నికలు పెడితే ఈవీఎంలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలు, ప్రజల సమస్యలను చర్చించడం కోసమే ప్రతి మూడేండ్లకోసారి సీపీఐ(ఎం) మహాసభలు గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభ స్థానిక సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అమలు తీరుపై చర్చించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామని చెప్పారు. ప్రజల కోసం పోరాడేది కేవలం కమ్యూనిస్టులేనని స్పష్టంచేశారు. భువనగిరి జిల్లా ప్రజానీకానికి కష్టం వస్తే సీపీఐ(ఎం) కార్యకర్తలు గుర్తుకు రావాలన్నారు. ఆ విధంగా పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు. పోరాటాలతోనే అధికారంలోకి రావొచ్చని ఇటీవల శ్రీలంకలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సభలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సత్తుపల్లి అనురాధ, పైళ్ల ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు, మంగ నర్సింహులు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బోర్డు కృష్ణారెడ్డి, ఎండీ పాషా, గంగాదేవి సైదులు, బండారు నర్సింహ, అవ్వారి రామేశ్వరి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మున్సిపల్ కౌన్సిలర్ దండా అరుణ్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.