– అన్ని రంగాల్లో గిరిజనుల బలోపేతానికి చర్యలు చేపట్టాలి
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాజీ ఎంపీ బృందాకరత్ డిమాండ్
– ముగిసిన ఆదివాసీ జాతీయ మహాసభలు
– 67 మందితో నూతన కమిటీ ఎన్నిక
– చైర్మెన్‌గా జితేంద్ర చౌదరి, జాతీయ కన్వీనర్‌గా పులిన్‌బాస్కి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోని ఆదివాసీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. తమిళనాడులోని నమ్మకల్ జిల్లా కేంద్రంలో ఈనెల 19న ప్రారంభమైన ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఆర్మ్) జాతీయ నాలుగో మహాసభలు గురువారం జయప్రదంగా ముగిశాయి. దేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎనిమిది తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ముగింపు ఉపన్యాసంలో బృందాకరత్ మాట్లాడుతూ రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అవి ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను వనవాసీలుగా చిత్రీకరిస్తూ వారి హక్కులపై దాడి చేస్తున్నదని విమర్శించారు. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు వేరుగా ఉన్నందున వారిని మతంతో సంబంధం లేకుండా ప్రకృతి ఆరాధికులుగా గుర్తింపు ఇవ్వడం ద్వారానే వారి ఉనికిని కాపాడగలుగుతామని అన్నారు. గిరిజనులు సామాజిక, ఆర్థిక రంగాల్లో రాణించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆదివాసీ, గిరిజనులపై బలవంతంగా రుద్దుతున్నాయని విమర్శించారు. అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక మార్కెట్ సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే గిరిజనులు, ఇతర రైతులు రక్షించబడతారని చెప్పారు. అందుకోసం గిరిజనులు, ఆదివాసీలు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివాసీ గిరిజనుల భారీ ప్రదర్శన
ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఆర్మ్) జాతీయ మహాసభల సందర్భంగా నమక్కల్ జిల్లా కేంద్రంలో గురువారం వేలాదిమంది ఆదివాసీ గిరిజనులతో భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యురాలు ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ చైర్మెన్ బృందా కరత్, జాతీయ చైర్మెన్ జితేంద్ర చౌదరి, జాతీయ కన్వీనర్ పులిన్ బాస్కీ, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, అఖిలభారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, తమిళనాడు ట్రైబల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఢిల్లీ బాబు, శరవణన్, నాయకులు పి షన్ముగం, ఏవీ షన్ముగం తదితరులు పాల్గొని ప్రసంగించారు.
17 మందితో ఈసీ ఎన్నిక
ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఆర్మ్) జాతీ య మహాసభలో 17 మందితో జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)ని ప్రతినిధులు ఎన్నుకున్నారు. నూతన జాతీయ చైర్మెన్‌గా జితేంద్ర చౌదరి, జాతీయ కన్వీనర్‌గా పులిన్ బాస్‌కి, వైస్ చైర్మెన్లుగా బృందా కరత్, డాక్టర్ మిడియం బాబురావు, ఆర్ సర్వన్, జెపి గావిత్, డి హెమ్రాం, నరేష్ జమాతియ, బివి ఖని, కో కన్వీనర్లుగా దులిచంద్ మీనా, తిరుపతి రావ్, కోశాధికారిగా ఢిల్లీ బాబు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఆర్ శ్రీరాం నాయక్, రాజాచంద్రన్ దే బర్మా, ఎస్‌వై గావిత్, వికాస్ రావెల్ ఎన్నికైన వారిలో ఉన్నారు. 67 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఎం ధర్మానాయక్, డి రవి నాయక్, బండారు రవికుమార్, పూసం సచిన్‌లున్నారు.