పోటీ పరీక్షలు ఆపేందుకు బీజేపీ బీ టీంలా కుట్రలు

 హైకోర్టు వ్యాఖ్యలు విపక్షాలకు చెంపపెట్టు :
తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలను ఆపేందుకు బీజేపీ, దాని బీ టీం పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులు పరీక్షలు రాసీ ఉద్యోగాలు సాధించడం విపక్షాలకు ఇష్టం లేదని విమర్శించారు.
పోటీ పరీక్షలు జరిగితే యువత బీఆర్‌ఎస్‌ వైపే మరలుతారని విపక్షాలకు భయం పట్టుకుందన్నారు. అందుకే ఈ నెల 11న జరిగే గ్రూప్‌ పరీక్షలు నిలిపేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు. న్యాయస్థానం పరీక్షలు నిర్వహించడానికి ఒప్పుకుందని తెలిపారు. పరీక్షలు నిర్వహించాలన్నా హైకోర్టు వ్యాఖ్యలు విపక్షాలకు చెంపపెట్టని తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసును సిట్‌ బృందం దర్యాప్తు చేస్తుందనీ, విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దీనిపై రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
క్రిస్టియన్‌ బోర్డు ఏర్పాటుకు కృషి
గంగా జమున తెహజీబ్‌కు ప్రతీకగా తెలంగాణ నిలుస్తున్నదని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవ ఐక్య సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్‌ సాగర్‌ మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్‌ తెలంగాణలోని అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. ప్రతి మతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో క్రిస్టియన్‌ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రిస్టియన్‌ యువత సేవారంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం రాణించాలని సూచించారు. క్రిస్టియన్లు అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. అలా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని తెలిపారు.

 

Spread the love