నవతెలంగాణ – హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికల వేళ సమీపిస్తుండడంతో అస్సలు పార్టీ పరిస్థితి ఏమిటి ? ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది తెలుసుకోవడానికి వచ్చారు. ఈ సందర్బంగా ప్రజలతో జరిగిన మీటింగ్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మీరు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. నవంబర్ 30న ఎన్నికలు జరగబోయేది కేవలం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ల మధ్యన మాత్రమే అన్నది ప్రజలు గుర్తుంచుకోండి అంటూ రాహుల్ గాంధీ చెప్పారు. ఎలాగు తెలంగాణాలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని తెలిసిందే… అందుకే బీఆర్ఎస్ ను గెలిపించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది..వీరికి తోడు MIM పార్టీ కూడా కేసీఆర్ కు మద్దతుగా ఉంది.. అలా మొత్తం మూడు పార్టీలు కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ అధికారణి దక్కించుకోవడానికి చూస్తున్నారు. మీరు వీరి కుట్రను గమనించి తెలంగాణను మీకిచ్చిన సోనియాగాంధీకి గౌరవంగా అధికారాన్ని ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది.. ఆ హామీని కాంగ్రెస్ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు. సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని, కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు.
‘‘కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంత మందికి ఇచ్చారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.. ఎంత మందికి చేశారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ మేం నెరవేర్చాం. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామన్నాం.. అమలు చేసి చూపాం. రూ.25 లక్షల వరకు ఉచితంగానే వైద్యం అందిస్తున్నాం. రాజస్థాన్‌లో ఉచిత వైద్యం పథకం దేశంలోనే అద్భుతంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం క్వింటాల్ రూ.2,500కు కొంటున్నాం. దేశంలోనే వరిధాన్యం కొనుగోలు ధర ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ. కర్ణాటక వెళ్లి చూడండి.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రతి నెలా మహిళలకు వారి అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు పడుతోంది. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పకుండా నిలబెట్టుకుంటుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.