బీజేపీ బీఆర్‌ఎస్‌ ఎంఐఎం ఈ మూడూ ఒక్కటే..

BJP BRS MIM These three are the same..– ప్రతి సందర్భంలోనూ కమలానికి మద్దతుగా నిలిచిన గులాబీ
– పార్లమెంటులోనూ బీఆర్‌ఎస్‌ ఎంపీల వైఖరిని గమమించాను
– బీజేపీతో పోరాటానికి ప్రతి రాష్ట్రంలో ఎంఐఎం ఆటంకమే
– ప్రజల సొమ్మును దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం
– హామీ ఇస్తే కచ్చితంగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్‌ : కాంగ్రెస్‌ విజయభేరీ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు బయటికే వేర్వేరు. లోపల అవి ఒక్కటే. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్నది ఒక్క బీఆర్‌ఎస్‌ తోనే కాదు. ఆ మూడు పార్టీలతో…’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. మాటలకే ఈ పార్టీలు వేర్వేరని ఆయన విమర్శించారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీల వైఖరిని చూశానని వివరించారు. ప్రధాని మోడీ సైగ చేస్తే చాలు వెంటనే వారు బీజేపీకి మద్ధతు ప్రకటిస్తుంటారని ఎద్దేవా చేశారు. గతంలో మోడీ సైగ చేయగానే రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో, జీఎస్టీ బిల్లుకు..ఇలా ప్రతి సందర్భంలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతునిచ్చిందని గుర్తుచేశారు. ఎంఐఎం కూడా అంతేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీపై కాంగ్రెస్‌ పోరాడుతుంటే మధ్యలో ఎంఐఎం ఆ పోరాటానికి అడ్డుపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విజయభేరీ సభను నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, సీడ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ , ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. ఆయా పార్టీల విధానాలను నిశితంగా విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ సభ ఏర్పాటు చేస్తుంటే ఆ మూడు పార్టీలు అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ను ఎలా ఆపాలనే అంశంపై మళ్లీ ఆ మూడు పార్టీలు చర్చించుకుంటాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రతి ప్రతిపక్ష నాయకునిపై మోడీ సర్కారు ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేసులను పెట్టించిందన్నారు. అదే సీఎం కేసీఆర్‌ పైన గానీ, ఎంఐఎం నాయకులపై గానీ ఎలాంటి కేసుల్లేవని గుర్తుచేశారు. మోడీ తన మద్ధతుదారులపై కేసులు పెట్టించరు. అందుకే అవినీతి రికార్డులను బద్ధలు కొట్టినా సరే…. సీఎం కేసీఆర్‌ పైన గానీ, ఎంఐఎం నేతలపైన గానీ ఎలాంటి కేసుల్లేవని……కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్లు, ధరణి పోర్టల్‌ స్కాంలో ప్రజల భూములు లాక్కోవడం, దళితుల భూములు లాక్కోవడం వంటి అనేక అవినీతి ఉదాహరణలున్నా పీఎం మోడీ సీఎం కేసీఆర్‌ పై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వంద రోజుల్లో దిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా కాపాడలేవని రాహుల్‌ హెచ్చరించారు.
కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తే ఆ హామీని కచ్చితంగా నిలబెట్టుకుంటుందని రాహుల్‌ ఈ సందర్బంగా తెలిపారు. సోనియాగాంధీ మాటిస్తే ఏ పరిస్థితిలోనైనా దాన్ని నెరవేరుస్తారని అన్నారు. ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామని గుర్తుచేశారు. అదే విధంగా రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను నెరవేస్తుందని హామీనిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీలను ఆమోదిస్తుందని వివరించారు. తమ పార్టీ పని తీరు ఎలా ఉందో పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. మోడీ.. ఆదానీ లాభాల కోసమే పని చేస్తారనీ, అదే విషయాన్ని పార్లమంటులో తాను ప్రస్తావిస్తే తన సభ్యత్వాన్ని రద్దు చేశారని వాపోయారు. మోడీకి, సీఎం కేసీఆర్‌ కు మధ్య భాగస్వామ్యముందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల డబ్బులను కేసీఆర్‌ కుటుంబం పంచుకుంటున్నదని విమర్శించారు. తాము రాష్ట్రం ఇచ్చింది కేవలం కేసీఆర్‌ కుటుంబం లబ్ది పొందేందుకు కాదని స్పష్టం చేశారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, చిన్న వ్యాపారులు, రైతులు, మహిళలు, యువత జీవితాలను మెరుగుపరిచేందుకే తెలంగాణ ఇచ్చామన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో దోపిడీకి గురైన ప్రజల డబ్బును తిరిగి వారికిప్పిస్తామని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ పై బాధ్యత ఉందని ఆయన తెలిపారు. తిరిగి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు. బీజేపీ విద్వేషం, హింస మార్కెట్‌ ను పెంచుతున్నదనీ, అందుకే తాము ప్రేమ దుకాణాన్ని తెరిచామని రాహుల్‌ వెల్లడించారు.

6 గ్యారంటీస్‌
మహాలక్ష్మి పథకం…
మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
పేదమహిళలకు కేవలం రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
రైతు భరోసా…
ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేల ఆర్థిక సాయం
వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌
గృహజ్యోతి పథకం
పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
ఇందిరమ్మ ఇండ్ల పథకం
ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

చేయూత పథకం
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
అర్హులైన వారికి నెలకు రూ.4 వేల పింఛన్‌
యువ వికాసం
కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం

Spread the love