తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు రావు

For BJP in Telangana No deposits– వారెంటే లేని కాంగ్రెస్‌ ప్రవేశపెట్టే స్కీమ్‌లకు గ్యారంటీ ఉండదు
– కార్పొరేట్‌ దోస్తులకు దేశాన్ని కట్టబెట్టేందుకే ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం : మంత్రి కె.తారక రామారావు
– పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం
నవతెలంగాణ – పెద్దపల్లి/ గోదావరిఖని
ప్రధాని మోడీ ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గోదావరిఖనిలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన రామగుండం దశాబ్ది సభలో పాల్గొన్నారు. సాయంత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అడగకుండానే అనేకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే అమలు అవుతున్నాయని తెలిపారు. మళ్ళీ మూడోసారి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మాటలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మోడీ రాష్ట్రంలో పర్యటిస్తూ రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు
మన రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వారెంటే లేదని, వారి గ్యారంటీ స్కీమ్‌లను చూసి ప్రజలు మోసపోవద్దని తెలిపారు. కర్నాటక, ఢిల్లీ నుంచి డబ్బు సంచులు తీసుకొచ్చి పంచేందుకు ప్రయత్నం చేస్తున్నారనిచ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు కాంగ్రెస్‌ నుంచి డబ్బులు తీసుకుని బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనకు వచ్చిన సందర్భంలో సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేయమని, అలాంటి ఆలోచన లేదని ప్రగల్భాలు పలికి, అనంతరం నాలుగు బొగ్గు గనులను వేలం వేశారని గుర్తుచేశారు. గుజరాత్‌లో అనుసరిస్తున్న విధంగా ఇక్కడ ఎందుకు చేయడం లేదని, గుజరాత్‌కు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కార్పొరేట్‌ దోస్తులకు దేశాన్ని కట్టబెట్టేందుకు స్కీమ్‌లవారీగా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ప్రాంత కార్మికులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.
రాష్ట్రం ఏర్పాటుతో సింగరేణి సంస్థ మెరుగుపడిందని ఉత్పత్తిలో వేలకోట్ల లాభాల్లో ఉందని తెలిపారు. అందుకుగాను సింగరేణి ప్రాంత కార్మికులకు లాభాల్లో 32 శాతం వాటా రూ. 711కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. దీపావళి బోనస్‌తో కలిపి సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్లు లాభాల వాటా అందుతుందన్నారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ భాను ప్రసాద్‌రావు, ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మెన్‌ కోలేటి దామోదర్‌, రామగుండం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, నాయకులు, పాల్గొన్నారు.
ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టు
మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా అర్థరాత్రి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి గోదావరిఖని, ఎన్టీటీసీ, మంథని, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌, జూలపల్లి తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రామాచారి, ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, జి.జ్యోతి, వనజా రాణి, ఎన్‌.శంకర్‌, లక్ష్మారెడ్డి, మహేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద రాజేందర్‌, బూడిద గణేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మానస్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ సంఘం నాయకులు ఉన్నారు.

Spread the love