వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పార్టీ నేత‌పై బీజేపీ వేటు

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్టీ విధానానికి భిన్నంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన అనుప‌మ్ హ‌జ్రాను పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి బీజేపీ తొల‌గించింది. అనుప‌మ్ హ‌జ్రాపై వేటు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పార్టీ వెల్ల‌డించింది. బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 2014లో తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బోల్పూర్ నుంచి విజ‌యం సాధించిన హ‌జ్రా ఆపై బీజేపీలో చేరారు. పార్టీ ద‌ళిత నేత‌గా పేరొందిన హ‌జ్రాకు 2020లో పార్టీలో కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. 2023లోనూ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించిన బీజేపీ ఆపై బీహార్ స‌హ ఇన్‌చార్జ్‌గానూ నియ‌మించింది. కానీ గ‌త కొద్ది నెల‌లుగా ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు వివాదాస్ప‌దమ‌య్యాయి. అవినీతికి పాల్ప‌డి ఈడీ, సీబీఐ స‌మ‌న్లు అందుతాయ‌ని భావిస్తున్న తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు బీజేపీలో చేరేందుకు త‌న‌ను సంప్ర‌దించాల‌ని హ‌జ్రా ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. బీజేపీలో చేరాల‌నుకునే వారు త‌న ఫేస్‌బుక్ పేజీకి వెళ్లి త‌న‌ను సంప్ర‌దించాల‌ని, మీ సేవ‌లు పార్టీకి ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తాము ప‌రిశీలిస్తామ‌ని హ‌జ్రా పేర్కొన్న వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌లైంది.

Spread the love