– మహిళలపై ఎప్పుడూ చిన్నచూపే..
– మతోన్మాదుల కట్టుకథ ‘కేరళ స్టోరీ’
– పంచాయతీ జూనియర్ కార్యదర్శుల తొలగింపు హెచ్చరిక సరికాదు: ఖమ్మంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– రెజ్లర్లకు మద్దతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
– ఎంపీ బ్రిజ్ భూషణ్ అరెస్టుకు డిమాండ్.. దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
లైంగిక వేధింపుల అవమానానికి గురైన మహిళా రెజ్లర్ల నిరసనను కేంద్రం పెడచెవిన పెడుతోందని, బీజేపీకి మనుధర్మం అమలుపై ఉన్న భక్తి మహిళలపై లేదని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ మల్లయోధులు నెలరోజులుగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మహిళల పట్ల చిన్నచూపునకు నిదర్శనం ఈ ఘటన అని వ్యాఖ్యానించారు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి సరిత క్లీనిక్ సెంటర్ వరకూ ప్రదర్శన నిర్వహించి, అక్కడ బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదన్నారు. మరోవైపు ప్రతిపక్షాలపై బురదజల్లేందుకు ‘కేరళ స్టోరీ’ అనే ఓ సినిమాను బయటకు వదిలారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి స్టోరీలు చాలా తీస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చెప్పడాన్ని తప్పుబట్టారు. ‘కేరళ స్టోరీ’ సినిమాలో వాస్తవాలను దాచిపెట్టారని చెప్పారు. వాస్తవంగా కేరళ నుంచి ఐఎస్‌ఐలో చేరేందుకు నాలుగు జంటలు వెళ్లగా దానిలో ఒకటి ముస్లిం జంట కూడా ఉందన్నారు. నేషనల్ సెక్యూరిటీ పెట్టిన కేసు, ఐఎస్‌ఐ ఉగ్ర సంస్థ ఇబ్బందులకు గురిచేసిన నాలుగు జంటల్లో ముస్లిం జంటను విస్మరించి మూడు జంటలు పడ్డ ఇబ్బందులనే సినిమాలో చూపించారన్నారు. మత మార్పిడి వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయని మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. దీనిని అడ్టుపెట్టుకొని మోడీ ప్రభుత్వం బహిరంగంగా మతోన్మాదచర్యలను ప్రోత్సహిస్తు న్నదని విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా మతోన్మాదాన్ని చాలా బహిరంగంగా ముందుకు తీసుకెళ్తూ మోడీ ప్రచారం నిర్వహిస్తున్న తీరును ఆక్షేపించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ విధానాలపై సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తాం… వాటికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ముఖ్యంగా ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు మద్దతుగా, మోడీ ప్రభుత్వ దాష్టీకానికి నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేశామన్నారు. అప్రజాస్వామిక చర్యలు ఎక్కడున్నా సీపీఐ(ఎం) ఖండిస్తోందన్నారు.
విధుల్లో చేరకపోతే తొలగిస్తామనడం దుర్మార్గం
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు శనివారం మధ్యాహ్నంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఊడినట్టేనని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం చాలా దుర్మార్గమైన చర్యని తమ్మినేని విమర్శించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా వాస్తవానికి రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ కు మించి ఉండదు..జేపీఎస్‌ల విషయంలో దానిని మూడేండ్లు చేసినా ఆ సమయం కూడా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నాలుగేండ్లయినా తమను క్రమబద్ధీకరించక పోవడంపై ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి వారిని చర్చలకు పిలవకపోగా ఉద్యోగాల నుంచి తీసివేస్తామనడం దుర్మార్గపు చర్యని ఖండించారు. జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ కోసం తాను స్వయంగా సీఎంకు లేఖ రాశానన్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశానని చెప్పారు. అయినా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదన్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అంటూ మనుస్మృతిలో చెప్పటం కాదు.. ఆచరణలోనూ మహిళలను గౌరవించాలి.. వారిని దేవతల్లా పూజించాలని బీజేపీ శ్రేణులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ హితవు పలికారు. మహిళల పట్ల బీజేపీ నేతలకు ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎం.సుబ్బా రావు, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బండారు రమేష్, ఆర్.ప్రకాష్, దొంగల తిరుపతిరావు, పి.ఝాన్సీ, పిన్నింటి రమ్య, పార్టీ 2టౌన్, 3టౌన్, అర్బన్ మండల కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్, భూక్యా శ్రీను, బత్తిన ఉపేందర్, నాయకులు బండారు యాకయ్య, మీరా, కె అమరావతి, గౌస్, భాగం అజిత తదితరులు పాల్గొన్నారు.